Navodayam, 27 నవంబర్ 2026: Pensions : తెలంగాణ రాష్ట్రంలోని కొత్త లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న దాదాపు 4.89 లక్షల మంది అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా కొత్త పెన్షన్ నిధులను జమ చేశారు. అయితే, బ్యాంకింగ్ సర్వర్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కొంతమంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇంకా నగదు బదిలీ కాలేదని అధికారులు గుర్తించారు. ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించే పనిలో యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో, మిగిలిన లబ్ధిదారులందరి ఖాతాల్లోకి ఈరోజు సాయంత్రంలోగా పెన్షన్ డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది.

పెన్షన్ స్టేటస్ తెలుసుకునే సులభమైన మార్గం
బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే లబ్ధిదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ (SMS) అలర్ట్ వస్తుంది. ఒకవేళ మొబైల్‌కు మెసేజ్ రాకపోయినా లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోలేని పరిస్థితి ఉన్నా లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక పెన్షన్ పోర్టల్ (సెర్ప్ – SERP వెబ్సైట్) లోకి వెళ్లి, అక్కడ ‘పెన్షన్ స్టేటస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం మీ పెన్షన్ ఐడీ (Pension ID) లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇంట్లోనే ఉండి సులభంగా తెలుసుకోవచ్చు.