Navodayam, 17 నవంబర్ 2026: AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో మరియు క్యాబ్ ఓనర్-డ్రైవర్లకు అందిస్తున్న ‘ఆటో డ్రైవర్ సేవలో’ (వాహనమిత్ర) పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంక్షేమ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ. 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ. 231 కోట్ల నిధులను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. త్వరలోనే ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన నగదు నేరుగా లబ్ధ్దిదారులైన ఆటో, క్యాబ్ ఓనర్-డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.

అర్హత నిబంధనలు స్పష్టం చేసిన ప్రభుత్వం – గూడ్స్ వాహనాలకు వర్తించదు
ఈ ‘వాహనమిత్ర’ పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఆర్థిక సాయం కేవలం సొంతంగా ఆటో లేదా క్యాబ్ నడుపుకుంటూ, ఆ వాహనానికి యజమానులుగా ఉన్న డ్రైవర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇతర గూడ్స్ (సరుకు రవాణా) వాహనాల డ్రైవర్లకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి జాప్యం లేకుండా నిధులను చేరవేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.