Navodayam, 29 నవంబర్ 2026: కొందరు దర్శకులు అరంగేట్రంలో అదరగొట్టి తర్వాత నిరాశ పరుస్తుంటారు. కొందరేమో తొలి సినిమాతో నిరాశపరిచినప్పటికీ, తర్వాత పుంజుకుని ఆశ్చర్యపరిచే సినిమా కంటెంట్ అందిస్తుంటారు. కార్తీక్ వర్మ దండు రెండో కోవకే చెందుతాడు. తన తొలి చిత్రం భం బోలేనాథ్ రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు కానీ తర్వాత చిత్రం విరూపాక్ష 100 కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది.
ఈ సుకుమార్ శిష్యుడు ఇప్పుడు వృషకర్మ సినిమాతో రాబోతున్నాడు. అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు కారణం స్టన్నింగ్ టీజర్, ట్రైలర్లే. విరూపాక్ష లాగే వృషకర్మ కూడా హారర్ టచ్ ఉన్న మిస్టిక్ థ్రిల్లరే. ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్ తీయబోతున్నట్టు సంకేతాలు ఇచ్చాడు కార్తీక్ వర్మ.
ఈ సినిమా లేటెస్ట్ ప్రెస్ మీట్లో కార్తీక్ వర్మ మాట్లాడుతూ తను హారర్‌లో ఉన్న అన్ని కోణాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించాడు. విరూపాక్ష, వృషకర్మ రెండు మిస్టిక్ థ్రిల్లర్లే అయినప్పటికీ.. వేటికవే భిన్నమైనవని, హారర్‌లో సబ్ జానర్లను తాను టచ్ చేశానని చెప్పాడు. ఈ సందర్భంగానే తాను తీసే సినిమాలు అన్నిటికీ పార్ట్ 2 లు ఉంటాయని చెప్పాడు.
మరోవైపు నాగచైతన్య మాట్లాడుతూ.. వృషకర్మతో కచ్చితంగా అంచనాలను అందుకుంటామని, తన చివరి చిత్రం తండేల్ సాధించిన 100 కోట్ల వసూళ్లను కూడా దాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన వృషకర్మలో చైతూ సరసన మీనాక్షి చౌదరి నటించింది. బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. డిసెంబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.