Navodayam, 22 నవంబర్ 2026: Ranigunj Traffic Diversions: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరిధిలో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. రాణిగంజ్ జంక్షన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నంబర్ 244ఏ పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో నవంబర్ 20 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ పనులు పూర్తయ్యేందుకు సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ఒక క్యారేజ్‌వేపై మాత్రమే తేలికపాటి వాహనాలకు అనుమతి

రాణిగంజ్ జంక్షన్‌లోని అండర్ బ్రిడ్జి వద్ద దాదాపు 1.5 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టి, మూడు క్యారేజ్‌వే లేన్లలో మరమ్మతులు నిర్వహించనున్నారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అందుబాటులో ఉండే స్థలం తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో R-2గా గుర్తించిన ఒక క్యారేజ్‌వేపై మాత్రమే తేలికపాటి వాహనాలకు అనుమతి ఇచ్చారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మాత్రమే నిర్దేశించిన మార్గంలో రాణిగంజ్ నుంచి ప్యారడైజ్, బోయిన్పల్లి వైపు వెళ్లవచ్చు. భారీ వాహనాలు, సరకు రవాణా వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు ఈ మార్గంలో అనుమతి ఉండదు. వాటిని వివిధ కూడళ్ల వద్ద ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు
- ఎస్బీఐ ఎక్స్‌రోడ్స్: ఇక్కడి నుంచి వచ్చే భారీ వాహనాలను రసూల్‌పురా, బేగంపేట వైపు మళ్లిస్తారు.
- ప్యాట్నీ ఎక్స్‌రోడ్స్: స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, ఎస్బీఐ ఎక్స్‌రోడ్స్ మీదుగా వచ్చే భారీ వాహనాలు సీటీసీ–ప్యారడైజ్ మార్గంలోకి వెళ్లకుండా క్లాక్‌టవర్ వైపు మళ్లాలి.
- ప్లాజా జంక్షన్: ఇక్కడి నుంచి వచ్చే భారీ వాహనాలను సీటీవో, రసూల్‌పురా, బేగంపేట వైపు పంపిస్తారు.
- పార్క్‌లేన్ ఎక్స్‌రోడ్స్: భారీ వాహనాలు ప్యాట్నీ ఎక్స్‌రోడ్స్ వైపు వెళ్లాలి.
- ప్యారడైజ్ ఎక్స్‌రోడ్స్: ఇక్కడి నుంచి వచ్చే భారీ వాహనాలను సీటీవో జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- సీటీవో జంక్షన్: మేడ్చల్, బోయిన్పల్లి వైపు నుంచి జాతీయ రహదారి-44 మీదుగా వచ్చే భారీ వాహనాలకు రెండు మార్గాలు సూచించారు. కుడివైపు వెళ్లేవి రసూల్‌పురా, మొనప్ప, నిరంకారి, లక్డీకాపూల్ మీదుగా వెళ్లాలి. ఎడమవైపు వెళ్లేవి ఎస్బీఐ ఎక్స్‌రోడ్స్, వైఎంసీఏ, సంగీత్ ఎక్స్‌రోడ్స్, రైల్ నిలయం, అలుగడ్డబావి మీదుగా ముషీరాబాద్ లేదా మెట్టుగూడ వైపు వెళ్లాలి.
- సెయిలింగ్ క్లబ్: ట్యాంక్‌బండ్ వైపు నుంచి రాణిగంజ్ వచ్చే భారీ వాహనాలను కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
- డీబీఆర్ మిల్స్: అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే వాహనాలను గాంధీనగర్ టీ జంక్షన్, కవాడిగూడ, సీజీవో టవర్స్ మీదుగా ముషీరాబాద్ వైపు పంపిస్తారు.
- కర్బలా ఎక్స్‌రోడ్స్: భారీ వాహనాలను బైబిల్ హౌస్ జంక్షన్, జబ్బార్ కాంప్లెక్స్, సీజీవో టవర్స్ మీదుగా మళ్లిస్తారు.
ఘాస్మండి, బైబిల్ హౌస్, నల్లగుట్ట, పాత అంబేడ్కర్ విగ్రహం, కట్టమైసమ్మ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
కార్లు, ఆటోలు, బైకులకు కూడా మళ్లింపులు
ప్యారడైజ్, మినిస్టర్ రోడ్ వైపు నుంచి రాణిగంజ్ వచ్చే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను రాణిగంజ్ ఎక్స్‌రోడ్స్ వద్ద డిస్టిలరీ రోడ్ మీదుగా కర్బలా జంక్షన్ వైపు మళ్లిస్తారు. నల్లగుట్ట ఎక్స్‌రోడ్స్ వద్ద వాహనాలను నెక్లెస్ రోడ్ వైపు పంపిస్తారు. అయితే రాణిగంజ్ అండర్ బ్రిడ్జి వద్ద నిర్దేశించిన R-2 క్యారేజ్‌వేలో తేలికపాటి వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
10 అడుగుల ఎత్తు పరిమితితో బ్యారియర్లు
అధిక ఎత్తు ఉన్న వాహనాలు ఆంక్షలు అమలులో ఉన్న మార్గాల్లోకి ప్రవేశించకుండా ఐదు ప్రాంతాల్లో హైట్ రెస్ట్రిక్టర్ రైలింగ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్యాట్నీ ఎక్స్‌రోడ్స్, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్, పార్క్‌లేన్ ఎక్స్‌రోడ్, రసూల్‌పురా ఎక్స్‌రోడ్, కర్బలా ఎక్స్‌రోడ్ వద్ద 10 అడుగుల ఎత్తు పరిమితి అమలు చేయనున్నారు.
ఈ 18 ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం
మరమ్మతుల పనులు పూర్తయ్యే వరకు మొత్తం 18 ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అవి:
- ఎస్బీఐ ఎక్స్‌రోడ్
- స్విమ్మింగ్‌పూల్ యూటర్న్
- ప్లాజా
- ప్యాట్నీ జంక్షన్
- ప్యారడైజ్ జంక్షన్
- పార్క్‌లేన్ ఎక్స్‌రోడ్స్
- రాణిగంజ్ జంక్షన్
- అద్వయ్య ఎక్స్‌రోడ్స్
- నల్లగుట్ట ఎక్స్‌రోడ్స్
- ఘాస్మండి
- సెయిలింగ్ క్లబ్
- కర్బలా ఎక్స్‌రోడ్
- బైబిల్ హౌస్ ఎక్స్‌రోడ్
- సీజీవో టవర్స్
- చిల్డ్రన్స్ పార్క్
- కవాడిగూడ ఎక్స్‌రోడ్
- లేపాక్షి
- పాత అంబేడ్కర్ విగ్రహం
Ranigunj Traffic Diversions: వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
రాణిగంజ్ ప్రధాన వాణిజ్య కేంద్రం కావడంతో ఇక్కడ హార్డ్‌వేర్, పనిముట్లు, యంత్రాలు, స్టీల్ వ్యాపారాలకు సంబంధించిన సరకు రవాణా వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాల మళ్లింపులతో వ్యాపార కార్యకలాపాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల వాహనదారులు వీలైనంత వరకు రాణిగంజ్, ఎంజీ రోడ్డు పరిసరాలను నివారించాలని, ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని పోలీసులు సూచించారు. దారి మళ్లింపు బోర్డులు, ట్రాఫిక్ సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్ సంబంధిత సహాయం కోసం 9010203626 నంబరును సంప్రదించవచ్చు.