- ఆయకట్టు తగ్గిందని, మరమ్మతుల నిధులూ తగ్గించాలని జీఆర్ఎంబీకి లేఖ
- పాజెక్టు రిపేర్లకు రూ.92 కోట్లు
- ఆయకట్టు ప్రకారం నిధులు భరించాలని గతంలో నిర్ణయం
- తాజాగా అందుకు విరుద్ధంగా ఏపీ వ్యవహారం
Navodayam, 26 నవంబర్ 2026: హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏపీ సర్కార్ మళ్లీ మాట మార్చింది. పెద్దవాగు మరమ్మతులకు మోకాలడ్డుతున్నది. ఆయక ట్టు తగ్గింది కాబట్టి మరమ్మతులకయ్యే ఖర్చులో తమ వాటానూ తగ్గించాలని కొత్త ప్రతిపాదనలు పెట్టింది. ఈ మేరకు జీఆర్ఎంబీకి జాగా లేఖ రాసిందని వి శ్వసనీయ సమాచారం. ఏపీ తీరుతో ప్రాజెక్టు మరమ్మతులు ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నది. ఇదే విషయమై తెలంగాణ సర్కార్ అభిప్రాయం కో రేందుకు బోర్డు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నది. ఇది ఉమ్మడి ప్రాజెక్టు. నీటి నిల్వ సామర్థ్యం 0.50 టీఎంసీలు. ప్రాజెక్టు కింద తెలంగాణకు 2,300 ఎకరాలు (15%), ఏపీ ఆయకట్టు 13,700 ఎకరాలు (85%) ఉన్నది. గోదావరి బేసిన్లో ఇరు రాష్ర్టాల మధ్య ప్రస్తుతం ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు ఇదే. 2024 జూలైలో వరదకు ప్రా జెక్టుకు గండి పడింది. వరద ఉధృతంగా వస్తున్నా, సకాలంలో గేట్లు ఎత్తకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే గండి ఏర్పడిందని నిర్ధారించారు. ఇరిగేషన్ శాఖకు రూ.30 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కగట్టారు. చుట్టూ రింగ్‌బండ్ కట్టినా ఇటీవలి వరదలకు అది కూడా కొట్టుకుపోయింది.
ఏపీ పేచీ.. తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం
శాశ్వత మరమ్మతుల కోసం దాదాపు రూ.92.2 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. ప్రస్తుతమున్న ప్రాజెక్టు స్పిల్‌వే సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కుల నుంచి లక్షకు పెంచాలని నిర్ణయించింది. అందుకుగాను మూడు గేట్లకు అదనంగా మరో ఐదు అమర్చాలని, ఏ రాష్ట్ర పరిధిలోని కాలువలను ఆ రాష్ట్రమే మరమ్మతులు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలపై 17వ సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టు ప్రయోజనాల ఆధారంగా మరమ్మతుల వ్యయాన్ని పంచుకునేందుకు రెండు రాష్ట్రాలు సమ్మతించాయి.
ఆ లెక్కన నిధుల్లో 85% ఏపీ, తెలంగాణ 15% భరించాల్సి ఉన్నది. కానీ, ఏపీ మాటమార్చింది. పోలవరం ప్రాజెక్టు వల్ల పెద్దవాగు పరిధిలోని కొంత ఆయకట్టు ముంపునకు గురయ్యే అవకాశమున్నదని చెప్తున్నది. ఆయకట్టు తగ్గుతున్న నేపథ్యంలో వ్యయా న్ని తగ్గించాలని పేచీ పెడుతున్నది. తెలంగాణ 18% భరించాలని, తాము 82% భరిస్తామని డిమాండ్ ముందుకు తెచ్చింది. ఏపీ కోరగానే వాటాలపై తెలంగాణ అభిప్రాయం కోరేందుకు బోర్డు సిద్ధమైంది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ డిజైన్లు, డ్రాయింగ్ల ఖరారు చేయలేదు. మరమ్మతుల కోసం తెలంగాణ తన వాటాగా రూ.3.46 కోట్లు భరించాల్సి ఉంది. ఆ నిధులను విడుదల చేయాలని కోరుతూ కొత్తగూడెం సీఈ నుంచి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదం తెలుపలేదు.