Navodayam, 24 నవంబర్ 2026: దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని రస్ అల్ ఖైమాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరీలో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ మంగళవారం వెల్లడించింది. అయితే ఎంతమంది భారతీయులు మరణించారు, ఎంతమంది గాయపడ్డారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రస్ అల్ ఖైమాలోని అల్ వతన్ రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తొలుత 11 మంది మరణించినట్లు యూఏఈ హోంశాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 14 మంది గాయపడ్డారు. 41 మందితో ప్రయాణిస్తున్న బస్సు, సాంకేతిక సమస్య కారణంగా రోడ్డుపక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొన్నట్టు ఖలీజ్ టైమ్స్ కథనం పేర్కొంది.
కాగా, ఈ ప్రమాదంపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలను సంప్రదించామని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపింది. బాధితులకు సహాయం కోసం 24 గంటల టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 800-46342ను కూడా ప్రకటించింది. గత నవంబర్ 13వ తేదీ తెల్లవారుజామున యూఏఈలోని ఫుజైరాలో జరిగిన మరో భారీ రోడ్డు ప్రమాదంలో కూడా నలుగురు భారతీయులు సహా 14 మంది మరణించారు.