Navodayam, 30 నవంబర్ 2026: మన తెలంగాణ/హైదరాబాద్: వాషింగ్టన్: అమెరికా దళాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను వినియోగించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం సంచలనమైంది. దీనిపై స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన మొదట్లో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు అంతర్గత కంపెనీ చర్చలతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను ఆ కథనం ఉటంకించింది. స్టార్‌లింక్‌ను రెండుసార్లు అనధికారికంగా వినియోగించినట్లు గుర్తించడంతో స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది. మరోవైపు, అమెరికా సైన్యం కూడా స్టార్‌లింక్ సైనిక విభాగమైన స్టార్షీల్డ్ను వన్‌వే డ్రోన్ల నిర్వహణకు ఉపయోగించినట్లు మస్క్‌కు సమాచారం అందింది. అయితే, ఇందుకోసం తక్కువ ధర భూతల కార్యకలాపాల ప్లాన్‌ను వినియోగించినట్లు తెలిసింది.
ఇరాన్ సైన్యం స్టార్‌లింక్ వినియోగంపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు రహస్య నివేదిక అందినట్లు కథనం పేర్కొంది. అయితే, అలాంటి నివేదికపై తమకు అవగాహన లేదని రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్లో స్టార్‌లింక్‌కు అనుమతి లేకపోయినా సేవలు అందుబాటులో ఉన్నట్లు మస్క్ గతంలో వెల్లడించారు. ఆందోళనల సమయంలో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేయగా, అమెరికా వేలాది స్టార్‌లింక్ టెర్మినళ్లను రహస్యంగా ఆ దేశంలోకి తరలించినట్లు గతంలో వార్తలొచ్చాయి.