Navodayam, 26 నవంబర్ 2026: కన్న కూతురినే కడతేర్చిన తండ్రి
ప్రేమ వ్యవహారం తెలిసి దారుణానికి ఒడిగట్టిన వైనం
దిండుతో ముఖంపై అదిమి హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
అరెస్ట్ చేసిన పోలీసులు
మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: పరువు కోసం కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో వెలుగుచూసింది. కూతురు మరో వ్యక్తిని ప్రేమిస్తోందని తెలుసుకున్న తండ్రి.. ఆమె ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాశ్ ఈనెల 24న తన కుమార్తె కల్యాణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులు, గ్రామస్తులకు తెలిపాడు.
అయితే బంధువులు వచ్చే వరకు కూడా వేచిచూడకుండా అదేరోజు ఉదయం మృతదేహాన్ని హడావుడిగా ఖననం చేయించాడు. దీంతో అతడి ప్రవర్తనపై బంధువులు, గ్రామస్తులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి నార్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కల్యాణికి వివాహం నిశ్చయమైందని, మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉందని తెలిసింది.
అయితే ఆమె మరో వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్న కైలాశ్.. పరువు పోతుందనే ఉద్దేశంతో హత్యకు పథకం వేశాడు. ఈ నెల 24న తెల్లవారుజామున నిద్రిస్తున్న కల్యాణి ముఖంపై దిండుతో అదిమి హత్య చేశాడు. అనంతరం చున్నీతో ఇంటి పైకప్పు దూలానికి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ కేసులో నిందితుడు కైలాశ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.