Navodayam, 23 నవంబర్ 2026: తెలంగాణ యువతకు జర్మనీలో అంతర్జాతీయ ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. జర్మనీలోని లోయర్ సాక్సనీ రాష్ట్రంతో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉద్యోగ నియామకాలపై భాగస్వామ్యం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపినట్లు రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.సోమవారం న్యూఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయంలో నిర్వహించిన టాలెంట్ మొబిలిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. లోయర్ సాక్సనీ ముఖ్యమంత్రి ఒలాఫ్ లీస్, జర్మనీ రాయబారి డాక్టర్ జాస్పర్ వీక్, డాక్టర్ బాల రమణితో పాటు ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 300 ఐటీఐలు ఉన్నాయని మంత్రి తెలిపారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకురాగా, మరో 54 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ శిక్షణ అందించి, స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్)లో లోయర్ సాక్సనీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
జర్మన్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు రూపొందించడం, పారదర్శక నియామక విధానాల ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఇరు ప్రాంతాల సంస్థల మధ్య సమన్వయం పెంచడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.