Navodayam, 23 నవంబర్ 2026: 
దేశంలో ముంబై – అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులోభాగంగా, తొలి దశ బుల్లెట్ రైలు ట్రయల్ రన్‌ను వచ్చే యేడాది నిర్వహించనున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ – బిలిమోరా ప్రాంతాల మధ్య ఈ ట్రయల్ రన్‌ను నిర్వహించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా గుజరాత్ సూరత్ – బిలిమోరా మధ్య గల 50 కిలోమీటర్ల మార్గంలో 2027 మే నెలలో ప్రయోగాత్మక పరీక్షలు (ట్రయల్ రన్) ప్రారంభంకానున్నాయని రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించే మొట్టమొదటి మార్గం ఇదే కావడం విశేషం.
ఈ మార్గంలో విద్యుద్దీకరణ పనులు ఇప్పటికే పూర్తిచేసినట్టు మంత్రి వెల్లడించారు. ఎలివేటెడ్ ట్రాక్‌పై ఉన్న అప్ అండ్ డౌన్ లైన్లకు నవంబరు 20న విజయవంతంగా విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. ఈ కారిడార్ కోసం అత్యాధునిక 2X25 కేవీ ట్రాక్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బిలిమోరా వద్ద ట్రాక్షన్ సబ్ స్టేషన్ పనులు కూడా ముగిశాయి. ఇక ఈ సెక్షన్లో మిగిలిన ఉన్న సిగ్నలింగ్ పనులు వచ్చే యేడాది జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి వెల్లడించారు.
మరోవైపు, ముంబై – అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకునిరానున్నారు. ఇందులోభాగంగా, అహ్మదాబాద్ – వాపీ ప్రాంతాల మధ్య 2027 చివరి నాటికి, ఆ తర్వాత మహారాష్ట్రలోని థానే వరకు 2029 నాటికి విస్తరించనున్నారు. కాగా, దేశంలో తొలి కమర్షియల్ హైస్పీడ్ రైలు సర్వీస్ 2027 చివరి త్రైమాసికంలోనే ప్రారంభం అవుతుందని మంత్రి వివరించారు.