Navodayam, 18 నవంబర్ 2026: Ap .comlocal body elections: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో నామినేషన్ల పర్వం రగడ సృష్టించింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ శ్రేణులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
నిషేధాజ్ఞల పేరుతో ర్యాలీ అడ్డుకోలు.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ శ్రేణులు
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన నామినేషన్ల ర్యాలీని ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధాజ్ఞల కారణంగా పోలీసులు మధ్యలోనే నిలిపివేశారు. నామినేషన్ల దాఖలుకు పెద్ద ఎత్తున గుంపులుగా వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యకర్తలు, సతీశ్ రెడ్డి సోదరుడు విష్ణువర్ధన్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాతే ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు తేల్చిచెప్పారు.

కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి పోలీసు నోటీసులు..
గతంలో జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నాటి ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడప ఎంపీ వై.ఎస్. అవినాశ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయన బయటకు రావద్దని ఆ నోటీసులో స్పష్టం చేశారు. స్వయంగా ఒక పోలీసు అధికారి ఎంపీ నివాసానికి వెళ్లి ఈ నోటీసును అందజేశారు.
పోలీసుల తీరుపై ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
పోలీసుల ఈ ముందస్తు నోటీసులు, ఆంక్షలపై ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవాలని పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అని ఆయన పోలీసు అధికారులను నిలదీశారు. పులివెందుల మండలంలో సర్పంచ్ అభ్యర్థుల అరెస్టులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
సింహాద్రిపురం మండలంలోని దేవతాపురంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న రమణయ్యతో పాటు ఆయన ప్రతిపాదకుడు శివప్రతాప్, మరొక వ్యక్తి బాబులను పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నామినేషన్లు దాఖలు చేయకుండా ఇలా ఎందుకు అడ్డుకుంటున్నారని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో పులివెందుల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.