Navodayam, 28 నవంబర్ 2026: కొన్ని సినిమాలు థియేటర్లలో ఎలా ఆడినా సరే ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పుడు ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తారు. అలాంటి చిత్రమే ఆదర్శ కుటుంబం. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాను థియేటర్లో చూడలేకపోయినా, ఓటిటిలో చూద్దామని చాలామంది ఎదురు చూశారు.
వారి నిరీక్షణకు తెరదించుతూ నెట్ ఫ్లిక్స్ నిన్న రాత్రి నుంచే ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో వెంటనే సోషల్ మీడియాలో ఆదర్శ కుటుంబం ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అనుకున్నట్లే ఈ సినిమాకు డిజిటల్ రిలీజ్ లోను మిశ్రమ స్పందన తప్పలేదు. కొందరు కామెడీ పర్లేదు అంటున్నారు కానీ.. సినిమాను ఎక్కువమంది కొంచెం ఘాటుగానే విమర్శిస్తున్నారు.
ఆదర్శ కుటుంబంలో ఎక్కువ మంది మెచ్చుకుంటున్నది, ప్రశంసల జల్లు కురిపిస్తున్నది సత్య కామెడీ విషయంలోనే. పోలీస్ స్టేషన్ ఇంటరాగేషన్ సీన్ సహా కొన్ని సన్నివేశాల్లో సత్య హావభావాలు, నటన కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తోందని నెటిజెన్లు కొనియాడుతున్నారు. ఆయా సన్నివేశాలు తాలూకు వీడియోలు పెట్టి సత్య మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతంతమాత్రంగా ఉన్న సినిమాను నిలబెట్టింది సత్యనే అని తీర్మానిస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద తీవ్ర విమర్శలు కురుస్తున్నాయి.
అసలు వెంకటేష్ హీరోగా పెట్టి ఇలాంటి కథతో సినిమా తీస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత బేసిక్ రైటింగ్ తో ఎలా హిట్ కొడదామని త్రివిక్రమ్ అనుకున్నారో అని ఆశ్చర్యపోతున్నారు. కథ మరి ఇల్లాజికల్ గా ఉందని.. ఎమోషన్ అసలు వర్కౌట్ కాలేదని విమర్శిస్తున్నారు. ఇంత టైం తీసుకుని తీసింది ఈ సినిమానా అని ఎద్దేవా చేస్తున్నారు. బ్లాస్ట్ మూవీతో పోలిక పెట్టి ఈ సినిమాపై గట్టిగానే పంచులు వేస్తున్నారు నెటిజన్లు.