Navodayam, 28 నవంబర్ 2026: డీ లిమిటేషన్ బిల్లుతో దేశంలో ప్రజా స్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదనను భారత ప్రజాస్వామ్య హత్యకు చిహ్నమని, ఇది బీజేపీ యొక్క చివరి ఆయుధమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఎన్నికల అక్రమాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడంతో కేంద్ర ప్రభుత్వం పరిస్థితి బోనులో పడ్డ ఎలుకలా తయారైందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కలిసి ప్రజల కళ్లుగప్పి “తప్పించుకునే మార్గాన్ని” ఎంచుకున్నారని ఆరోపించారు.
నియోజకవర్గాల పునర్విభజనను కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి వ్యతిరేకస్తూనే వుంది. దీనివల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందని వాదిస్తుంది. అయితే 50 శాతం సీట్లు పెంచే విధంగా చట్టంలో మార్పులు చేసినట్టు బీజేపీ చెబుతుంది. ఆమధ్య ఒకసారి డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులలు కలగలిపి తీసుకోచ్చేందుకు ప్రయత్నం చేసి విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెరవెనుక బేరసారాలు నడిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతేనేం సోమవారం బిల్లు పార్లమెంట్ ఎదుట వస్తుంది.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, చిదంబరం విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఇప్పటికే అనేక సార్లు దీనిమీద కామెంట్స్ చేసివున్నారు. 850 సీట్ల పెంపుదల ద్వారా బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకునే పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని ఆరోపించారు. ఈ విమర్శపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికీ ఈ విషయం మీద అనేక రాష్ట్రాల్లో విమర్శలు కొనసాగుతున్నాయి. కశ్మిర్, అస్సాంలలో జరిగిన నియోజకవర్గాల
సరిహద్దు మార్పులను విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 850 ఎంపీ సీట్లు అవసరం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇప్పుడున్న 543 స్థానాలతోనే ఓబీసీ ఉప కోటాతో సహా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. మహిళా కోటాను సాకుగా చూపి దొడ్డిదారిలో సీట్ల పెంపుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
2027 జనాభా లెక్కలు, కుల గణనను పక్కనపెట్టి 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్లను పెంచడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు రాబోయే 40 ఏళ్ల పాటు సామాజిక న్యాయం అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసే ఆయుధంగా మారిన డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ఓడించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.