Navodayam, 17 నవంబర్ 2026: Muta Mestri : మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే వార్త. ఆయన కెరీర్లో మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ముఠామేస్త్రి’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 4K వెర్షన్లో ఈ నెల 22న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రత్యేక రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ మెగాస్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
చిరంజీవి మాస్ యాక్షన్.. మరోసారి వెండితెరపై సందడి
1993లో విడుదలైన ‘ముఠామేస్త్రి’ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుని చిరంజీవి కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఆయన మాస్ యాక్షన్, అదిరిపోయే డైలాగులు, అద్భుతమైన డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్-కోటి అందించిన సంగీతం, పాటలు ఇప్పటికీ అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. ఇప్పుడు అత్యాధునిక 4K సాంకేతికతతో ఈ చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటంతో థియేటర్లలో సందడి నెలకొనే అవకాశం ఉంది. అప్పట్లో థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేయడంతో పాటు, నేటి తరం ప్రేక్షకులకు చిరంజీవి పాతకాలపు మాస్ మ్యాజిక్‌ను పరిచయం చేయనుంది.