Navodayam, 23 నవంబర్ 2026: Gold Spot : 90వ దశకంలో భారతీయుల మనసు దోచుకుని, మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిన ప్రముఖ ఆరెంజ్ ఫ్లేవర్ శీతల పానీయం ‘గోల్డ్ స్పాట్’ (Gold Spot) మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ పానీయాల సంస్థ కోకా-కోలా (Coca-Cola) ఈ పాపులర్ బ్రాండ్‌ను తిరిగి పునరుద్ధరించాలని యోచిస్తున్నట్లు వ్యాపార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 1993లో పార్లే (Parle) సంస్థ నుంచి గోల్డ్ స్పాట్‌తో పాటు థమ్స్ అప్, లిమ్కా వంటి బ్రాండ్లను కోకా-కోలా కొనుగోలు చేసింది. అయితే, తన సొంత బ్రాండ్ ‘ఫాంటా’ (Fanta) అమ్మకాలను ప్రోత్సహించే వ్యూహంలో భాగంగా 2000 సంవత్సరంలో గోల్డ్ స్పాట్ ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది.

ఆరోగ్య స్పృహకు తగ్గట్టుగా కొత్త అవతారంలో రీలాంచ్ ప్లాన్
దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, పాత తరం వినియోగదారుల్లో ఉన్న నాస్టాల్జియా (పాత జ్ఞాపకాల క్రేజ్)ను క్యాష్ చేసుకుని మార్కెట్ వాటాను పెంచుకోవాలని కోకా-కోలా వ్యూహరచన చేస్తోంది. అయితే, మారుతున్న వినియోగదారుల అభిరుచులు మరియు ఆరోగ్య స్పృహను దృష్టిలో ఉంచుకుని, ఈసారి గోల్డ్ స్పాట్‌ను ‘లో-షుగర్’ (తక్కువ చక్కెర) లేదా ‘నో-షుగర్’ (చక్కెర లేని) వెర్షన్లలో రీలాంచ్ చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే, 90స్ కిడ్స్‌కు ఇది ఒక గొప్ప మధురానుభూతిని పంచడమే కాకుండా శీతల పానీయాల మార్కెట్లో సరికొత్త పోటీకి దారితీయనుంది.