Navodayam, 18 నవంబర్ 2026: పుణే : మహారాష్ట్రలోని పుణే టింబర్ మార్కెట్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జై వల్లభ్ స్కూల్ సమీపంలో ఉదయం 2.05 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కలప దుకాణాలు అధికంగా ఉండటంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో సుమారు 50 నుంచి 60 దుకాణాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు బ్రిగేడ్ కాల్ ప్రకటించి 27 ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దించారు. వీటిలో పుణే ఫైర్ బ్రిగేడ్‌కు చెందిన 24, కంటోన్మెంట్‌కు చెందిన ఒకటి, పిఎంఆర్‌డిఎ కి చెందిన రెండు వాహనాలు ఉన్నాయి. 150 మందికి పైగా సిబ్బంది, సుమారు 10 మంది ఫైర్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలు సమీపంలోని నివాస ప్రాంతాలకు వ్యాపించకుండా మార్కెట్‌కు నాలుగు వైపుల నుంచి నీటిని చల్లారు.
దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. స్థానికుల ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 100 దుకాణాలు ప్రభావితమై ఉండవచ్చని పుణే చీఫ్ ఫైర్ ఆఫీసర్ గణేశ్ సోనుణే వెల్లడించారు. అయితే పూర్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.