Navodayam, 17 నవంబర్ 2026: Akwan Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఇవాళ తీవ్ర తుపానుగా, గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తుపాను ప్రస్తుతం చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో.. మచిలీపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో.. విశాఖపట్నానికి 660 కిలోమీటర్ల దూరంలో.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు సగటున 3 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తున్న ఈ తుపాను మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అక్వాన్ తుపాను ఇవాళ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భీకర గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తుపాను నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు. పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు, పనిముట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారుల నుంచి వచ్చే సూచనలను పాటించాలని కోరారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలతోపాటు.. ఈదురుగాలుల సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని.. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు.
విద్యుత్ సమస్యల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు..
అక్వాన్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసింది. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా, విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనా ఈ నంబర్లను సంప్రదించవచ్చునని సూచించింది.
టోల్ ఫ్రీ నంబర్ : 1912
కృష్ణా : 6281709355
ఎన్టీఆర్ : 9440817561
గుంటూరు : 9440817526
బాపట్ల : 9281413774
ప్రకాశం : 9440817491
పల్నాడు : 7382623148
మార్కాపురం : 7780420711
CRDA : 8331092947