Navodayam, 28 నవంబర్ 2026: ఉద్యోగం కోసం చాలామంది పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తుంటారు. ముఖ్యంగా ఐటీ, వైద్య, భద్రతా రంగాల్లో నైట్ షిఫ్టులు సాధారణంగా మారిపోయాయి. అయితే ఇలా తరచూ రాత్రిపూట పనిచేయడం వల్ల నిద్రకే కాదు.. గుండె ఆరోగ్యానికి కూడా ముప్పు ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. నైట్ షిఫ్టులు చేసేవారిలో గుండె నిర్మాణంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
సాధారణంగా మన శరీరం పగటిపూట పనిచేయడానికి, రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి అలవాటు పడుతుంది. కానీ ఉద్యోగాల కారణంగా రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల శరీర సహజ జీవ గడియారం దెబ్బతింటుంది. దీనివల్ల నిద్ర, హార్మోన్లు, జీవక్రియపై ప్రభావం పడుతుంది.
ఈ అంశంపై యూకే బయోబ్యాంక్ లోని 42,671 మంది ఆరోగ్య వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. కార్డియాక్ ఎంఆర్ఐ పరీక్షల ద్వారా గుండె నిర్మాణం, పనితీరును పరిశీలించారు. ఈ అధ్యయన వివరాలు యూరోపియన్ హార్ట్ జర్నల్ – కార్డియోవాస్కులర్ ఇమేజింగ్ లో ప్రచురితమయ్యాయి.
తరచూ రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారిలో గుండె కండరాల గోడలు కొంత మందంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. గుండెలో రక్తం నిండే గదుల పరిమాణంలోనూ మార్పులు కనిపించాయి. అలాగే గుండె కండరాల పనితీరులో కొన్ని తేడాలు నమోదయ్యాయి. రక్తంలోని కొన్ని కొవ్వు పదార్థాలు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన సూచికల్లో కూడా మార్పులు కనిపించాయి.
అయితే నైట్ షిఫ్టుల వల్లే ఈ మార్పులు వచ్చాయని అధ్యయనం నిర్ధారించలేదు. ఈ సంబంధాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి అదనపు పరిశోధనలు అవసరం. రాత్రిపూట పనిచేసేవారు తమ నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. రోజుకు సరిపడా నిద్రపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఉద్యోగం ఎంత ముఖ్యమైనదైనా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం.