Navodayam, 27 నవంబర్ 2026: IND vs NZ 2nd Test : న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ ను ఆడుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ డ్రా కాగా.. రెండో టెస్టు మ్యాచ్ ఇవాళ ఉదయం క్రైస్ట్‌చర్చ్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టు డ్రాగా ముగియడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ లను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు ఈ సిరీస్‌నైనా దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.
ఇదిలాఉంటే.. రెండో టెస్టు కోసం భారత జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అతడిని తుది జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో చోటు దక్కలేదు. వారికి మళ్లీ నిరాశే దక్కింది.
తొలి టెస్టులో మహమ్మద్ సిరాజ్ కు చోటు దక్కకపోవటం రాజకీయ దుమారం రేపింది. అతనికి తుది జట్టులో అవకాశం ఇవ్వకుండా తప్పుచేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అంతేకాక.. సిరాజ్ అనే పేరు ఉండటం వల్లనే అతన్ని తుది జట్టులోకి తీసుకోవటం లేదంటూ ఓ కాంగ్రెస్ నేత విమర్శించగా.. బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇలా రెండు పార్టీల నేతల మధ్య సిరాజ్ ఎంపిక విషయంలో మాటల యుద్ధం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో సిరాజ్‌కు రెండో టెస్టు తుది జట్టులో అవకాశం దక్కుతుందని భావించారు. కానీ.. రెండో టెస్టులోనూ అతనికి అవకాశం దక్కలేదు.
భారత్ తుది జట్టు : కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, ఆకాశ్‌దీప్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ తుది జట్టు : టామ్ లాథమ్(కెప్టెన్), డేవన్ కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైల్ జెమీసన్, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫ్పీ.
ఇదిలాఉంటే.. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గుర్నూర్ తన తొలి టెస్టులో తొలి వికెట్ పడగొట్టాడు. డేవన్ కాన్వే (31)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపించాడు. మరో వైపు కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్(42) క్రీజులో నిలదొక్కుకొని నిలకడగా ఆడుతున్నాడు. లాథమ్‌కు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. కాన్వేకి 150వ మ్యాచ్ కావడం విశేషం. లంచ్ విరామ సమయానికి 26 ఓవర్లలో న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది.