Navodayam, 26 నవంబర్ 2026: KTR Tweet: తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆయన ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో రాహుల్ గాంధీ ఒక నాటకానికి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. నాటకీయ లైటింగ్ మధ్య ఇరానీ చాయ్ తాగుతూ, ఫొటోలకు పోజులిస్తూ ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించారని, కానీ మూడేళ్ల తర్వాత అసలు నిజం బయటపడిందని ఆయన పేర్కొన్నారు.

KTR Tweet: రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌పై విమర్శల దాడి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఒక మిథ్య అని, యువ వికాసం ఒక ఎండమావి (మిరాజ్) అని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ తెలంగాణ యువత నమ్మకాన్ని అపహాస్యం చేసేలా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్ కాదని, చాయ్ తాగుతూ చేసే పబ్లిసిటీ స్టంట్ అంతకంటే కాదని వ్యాఖ్యానించారు. కనీసం ఒక్క ఉద్యోగం కల్పించాలన్నా దార్శనికతతో పాటు అచంచలమైన నిబద్ధత ఉండాలని ఆయన హితవు పలికారు.
హక్కుల కోసం యువత మళ్లీ పోరాడుతుందన్న కేటీఆర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఈ ప్రాంత యువత, ఇప్పుడు తమకు రావాల్సిన ఉద్యోగాల హక్కుల కోసం కూడా అదే రీతిలో పోరాడుతుందని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తుండగా, మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికే వేలాది నియామక పత్రాలు అందించామని, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.