Navodayam, 25 నవంబర్ 2026: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. సీఎంపై అవహేళన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. బుధవారం ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్ వద్ద సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు, కాలేశ్వరం నిర్మాణంపై హరీశ్‌రావు వ్యాఖ్యలకు సమాధానంగా అవకతవకలను బట్టబయలు చేసేందుకు వాస్తవాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గానికి హరీశ్‌రావు సాగు, తాగునీటి విషయంలో అన్యాయం చేశారని ఆరోపించారు. నంది మేడారం రిజర్వాయర్ కట్టను పాత కట్టపై నిర్మిస్తే ప్రజల ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో లోపలికి జరిపారని, దీంతో నీటి సామర్థ్యం తగ్గిందని అన్నారు.
ఏ గ్రామానికీ సాగు, తాగునీరు అందలేదని, పత్తిపాక ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. చామనపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించకపోవడం ఆనాటి ప్రభుత్వానికి, హరీశ్ రావుకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చామనపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించి, పూర్తి నష్టపరిహారం ఇచ్చి కొత్త గ్రామం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు హరీశ్‌రావు సంపాదించారని ఆరోపించారు. మళ్లీ వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో లావుడియా రూప్లనాయక్, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కొత్త నరసింహులు, సంఘ రంజిత్ యాదవ్, వీర్ పాల్, అరీగే లింగయ్య, చింతల ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.