Navodayam, 25 నవంబర్ 2026: మన తెలంగాణ/హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలకు టిజి రెరా జరిమానాలు విధించింది. ఒకే రోజు వివిధ సంస్థలపై చర్యలు తీసుకుంది. రెరా అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్న పలు సంస్థలపై జరిమానాలు విధించింది.
రూ.2 కోట్లు 60 రోజుల్లో చెల్లించాలి
సేల్ అగ్రిమెంట్ చేయకుండానే కొనుగోలుదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు చేయడంతోపాటు, సేల్ అగ్రిమెంట్ నిబంధనలను ఉల్లంఘించిన ఏలియన్స్ డెవలపర్స్ సంస్థకు టిజి రెరా రూ.2 కోట్ల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని 60 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. కొనుగోలుదారులకు ఏడు రోజుల్లోగా నిర్దేశిత నమూనాలో సేల్ అగ్రిమెంట్ అందించాలని స్పష్టం చేసింది. ఫ్లాట్ అప్పగింతకు నిర్దిష్ట తేదీని వెల్లడించని పక్షంలో, కొనుగోలుదారులు ప్రాజెక్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే వారు చెల్లించిన రూ.42,11,898 మొత్తాన్ని 10.85 శాతం వార్షిక వడ్డీతో సహా 60 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
సేల్ అగ్రిమెంట్ లేకుండా 15 శాతం వసూలు చేసిన ఈఎల్వీ డెవలపర్స్‌కు రూ.3.20 లక్షల జరిమానా విధించింది. ఆలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ రూ.17.42 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అలాగే, రెరా చట్టంలోని సెక్షన్లు 3, 4 ఉల్లంఘనలకు సంబంధించి ఆలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్, సంబంధిత భాగస్వాములతోపాటు ఎమరాల్డ్ ఎస్టేట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, చట్టప్రకారం చర్యలు చేపట్టాలని రెరా కార్యదర్శిని ఆదేశించింది. కొనుగోలుదారులు చెల్లించిన రూ.9.30 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని భారతి బిల్డర్‌కు రెరా ఆదేశాలు జారీ చేసింది.
రూ.33 లక్షలకుపైగా చెల్లింపులు చేయాలి
వాసవి రియల్టర్స్ రూ.33.60 లక్షలపై 10.85 శాతం వడ్డీ చెల్లించాలని రెరా ఆదేశించింది. నిర్మాణాలు పూర్తి చేయడంలో జరిగిన జాప్యానికి వడ్డీ చెల్లించాలని భువన్‌తేజ ఇన్ఫ్రాకు సూచించింది. భువన్‌తేజ ఇన్ఫ్రాకు సంబంధించిన నాలుగు ఫిర్యాదులపై రెరా ఈ ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, అనుమతులు, రెరా నమోదు పొందకుండానే సి, ఇ బ్లాకుల్లో ఫ్లాట్ల విక్రయాలు చేపట్టడం, రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ లేకుండా డబ్బు వసూలు చేయడంపై సుమోటో విచారణ చేపట్టాలని రెరా కార్యదర్శిని ఆదేశించింది. ఈఎల్వీ కాస్మోపాలిస్ ప్రాజెక్టులో ఆరు నెలల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని రెరా ఆదేశాలు జారీ చేసింది. శ్రీ సూర్య డెవలపర్స్ 60 రోజుల్లోగా వినియోగదారులకు విద్యుత్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఎంపైర్ అర్బానా అనే డెవలపర్‌తో కొనుగోలుదారు తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు రూ.లక్ష తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మోదీ బిల్ డర్స్ సంస్థకు చెందిన ప్రాజెక్టులో ఫ్లాట్ నిర్మాణ నాణ్యత, ఫ్లోరింగ్, పెయింటింగ్, ప్లంబింగ్ పనుల్లో లోపాలు ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదును తెలంగాణ రెరా కొట్టివేసింది.