Navodayam, 25 నవంబర్ 2026: Mohan Bhagwat: ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్ ఎదగాలని, అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్(Mohan Bhagwat) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ రాజకీయాల్లో శక్తిమంతమైన దేశాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాయని పేర్కొన్నారు. ‘బలవంతుడిదే పైచేయి’ అనే సిద్ధాంతంతో ఇతరులను ఒత్తిడిలో ఉంచాలని చూస్తాయని, భారత్ వేగంగా అభివృద్ధి చెందితే ఆయా దేశాల ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాలకు గండి పడుతుందని ఆయన విశ్లేషించారు. అయితే, మనల్ని ద్వేషించే పొరుగు దేశాలైన మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లతో పాటు పాకిస్థాన్‌కు కూడా ఆపత్కాలంలో భారత్ సాయం అందించిన విషయాన్ని మోహన్ భాగవత్ గుర్తుచేశారు.
బానిసత్వం నుంచి బయటపడిన నేటి యువత:
నేటి భారత యువత బానిసత్వ మనస్తత్వం, ప్రభావాల నుంచి పూర్తిగా బయటపడిందని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరం అబద్ధాలను ఏమాత్రం సహించదని, ఎవరైనా నిజాయతీతో మాట్లాడితే వారికి అండగా నిలబడుతుందని చెప్పారు. తమ దేశాన్ని ప్రపంచంలోనే గొప్పగా చూడాలని యువత బలంగా కోరుకుంటోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
2047 వికసిత్ భారత్ లక్ష్యంలో యువతదే కీలక పాత్ర:
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) మాట్లాడుతూ, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో నేటి యువత పాత్ర అత్యంత కీలకమని అన్నారు. దేశ అభివృద్ధి ఫలాలు కూడా భవిష్యత్తులో ప్రధానంగా ఈ తరానికే దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు.