Navodayam, 23 నవంబర్ 2026: BAM Diwali Dasara Utsav 2026: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బామ్ దీపావళి–దసరా ఉత్సవ్ 2026’ అత్యంత వైభవంగా జరిగింది. బ్రిక్ఫీల్డ్స్లోని కాంప్లెక్స్ టీఎల్‌కే ప్రాంగణంలో ఉన్న టానియా గ్రాండ్ హాల్ ఈ ఆత్మీయ వేడుకలకు వేదికైంది. ఈ కార్యక్రమానికి కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ ప్రథమ కార్యదర్శి శ్రీ రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, పలువురు స్థానిక ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 1,300 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాలుపంచుకుని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

ప్రవాస భారతీయుల ఐక్యతకు నిదర్శనం
మలేషియాలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన భారతీయ కుటుంబాలన్నీ ఒకే వేదికపై కలుసుకుని దీపావళి, దసరా పర్వదినాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ప్రవాస భారతీయులకు ఉన్న మక్కువను, వారి మధ్య ఐక్యతను ఈ వేడుకలు ప్రతిబింబించాయి.
BAM Diwali Dasara Utsav 2026: ఆకట్టుకున్న శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు
సంప్రదాయ శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆద్యంతం అలరించాయి. సైబర్జయకు చెందిన భక్తి గురుకులం విద్యార్థుల భజనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపగా, మహారాష్ట్ర లెజీమ్ డ్యాన్స్, రాజస్థానీ మార్వాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ‘డ్యాన్సింగ్ దివాస్’ బృందం ప్రదర్శించిన వివాహ వేడుకల నృత్యరూపకం, మహిళల ఫ్యూజన్ డ్యాన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన కళాకారులకు బామ్ కమిటీ తరఫున జ్ఞాపికలను అందించి ఘనంగా సత్కరించారు.
‘టాలెంట్ షోకేస్’ విజేతలకు సత్కారం.. ఉత్సాహంగా దాండియా
ఉత్సవంలో భాగంగా నిర్వహించిన ‘బామ్ టాలెంట్ షోకేస్’ పోటీలకు 29 ఎంట్రీలు రాగా, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తొలి ఐదు స్థానాల్లో నిలిచిన విజేతలకు వేదికపై పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన ‘మిస్టరీ బాక్స్’, ‘లక్కీ సీట్’ వంటి వినోదాత్మక ఆటల్లో ఆహూతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా పండుగ విందును ఆరగించిన అనంతరం, మహారాష్ట్ర ఢోలు దరువులకు అనుగుణంగా చిన్నారులు, పెద్దలు కలిసి ఆడిన దాండియా నృత్యంతో వేడుకలు కోలాహలంగా ముగిశాయి.
అందరి సహకారంతోనే ఈ విజయం: బామ్ ప్రధాన కార్యదర్శి రవితేజ
ఈ వేడుకల విజయవంతంపై బామ్ ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీ దాస్యం హర్షం వ్యక్తం చేశారు. 1,300 మందికి పైగా భారతీయ కుటుంబాలు ఒకే చోట చేరి పండుగలను జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి శ్రమించిన కమిటీ సభ్యులు, వాలంటీర్లు, కళాకారులు, స్పాన్సర్లు మరియు హాజరైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో మరిన్ని సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
వేడుకలకు అండగా నిలిచిన ప్రాయోజకులు (స్పాన్సర్లు)
ఈ మెగా ఈవెంట్‌కు జీఆర్పీసీ మలేషియా (GRPC Malaysia) ప్రీమియం స్పాన్సర్‌గా వ్యవహరించగా.. డీఎస్ఎస్ సొల్యూషన్స్, మేపుల్ట్రీ సొల్యూషన్స్, స్ప్రౌట్ ఎడ్యుకేషనల్ అకాడమీ, ఎరుడైట్ స్కూల్స్, ఐడియాలాజిక్ టెక్నాలజీస్, కేవీటీ జ్యువెలర్స్, ఎన్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్, మద్రాస్ బేకరీ సంస్థలు సహ స్పాన్సర్లుగా తమ వంతు సహకారం అందించాయి. ఆహూతులకు రుచికరమైన విందును జాబిల్లి రెస్టారెంట్, మై బిర్యానీ హౌస్, వైట్ఫిన్స్ మై 81, శుద్ధవిలాస్, శ్రీ రుచి రెస్టారెంట్లు సమకూర్చాయి.
కార్యక్రమాన్ని పర్యవేక్షించిన బామ్ కార్యవర్గ బృందం
ఈ ఉత్సవంలో బామ్ అధ్యక్షుడు చొప్పరి సత్య, ఉపాధ్యక్షుడు భాను ముత్తినేని, ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీ దాస్యం, కోశాధికారి (ట్రెజరర్) రుద్రాక్షల సునీల్ కుమార్, సంయుక్త కోశాధికారి గజ్జడ శ్రీకాంత్, యువజన విభాగ నాయకుడు రుద్రాక్షల రవికిరణ్ కుమార్, మహిళా సాధికారత విభాగ నాయకురాలు గీత హజారే కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులు సొప్పరి నవీన్, అపర్ణ ఉగంధర్, సాయిచరణి కొండ, రహిత, సొప్పరి రాజేష్, సురేఖ, ఆశ, రామ్, భార్గవ్, సింధూర, సంధ్య తదితరులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.