Navodayam, 23 నవంబర్ 2026: పేద, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ హౌసింగ్ బోర్డు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ప్రాజెక్టులకు రెరా అనుమతులు లభించాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా గుర్తింపు లభించడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించి రెరా ఛైర్మన్ శ్రీనివాసరాజు నుంచి సోమవారం అనుమతి పత్రాలను హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం అందుకున్నారు.తొలి దశలో మలక్పేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయి. హైదరాబాద్ మహానగర పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. తొలి విడతలో పైలట్ ప్రాజెక్టుగా 20 నియోజకవర్గాల్లో సుమారు 12 వేల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా భూమిని అందించడంతోపాటు, ఫ్లాట్లకు సంబంధించిన అవిభక్త భూమి వాటా (యూడీఎస్)ను కూడా లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుంది. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. రెరా అనుమతులతో ప్రాజెక్టుల అమలులో పారదర్శకత, నిబంధనల పాటింపు, లబ్ధిదారుల హక్కులకు చట్టబద్ధమైన భరోసా లభించనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై లబ్ధిదారుల్లో విశ్వాసం పెరగడంతోపాటు, బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ కూడా వేగవంతం కానుంది.
సాధారణ మార్కెట్లో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువ చేసే ఫ్లాట్లను పేదలకు కేవలం రూ.6 లక్షలకే అందించనున్న నేపథ్యంలో, రెరా ఛైర్మన్ ప్రత్యేక చొరవతో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశారు. రెరా అనుమతులు పొందడం హౌసింగ్ బోర్డు చరిత్రలో కీలక మైలురాయి అని వైస్ ఛైర్మన్ విపి గౌతం పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో ప్రాజెక్టులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని, పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ గృహ నిర్మాణ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.