Navodayam, 19 నవంబర్ 2026: Mohammed Siraj : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గురువారం ఉదయం వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో ప్రారంభమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
తొలి టెస్టు కోసం సిరాజ్ స్థానంలో యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌కు అవకాశం కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో విలేకరులు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ను ప్రశ్నించగా.. జట్టు ఎంపికను ఆయన సమర్థించారు. పరిస్థితులను, ప్రత్యర్థి జట్టు కూర్పును దృష్టిలో పెట్టుకునే తుది జట్టును ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. అంతేకానీ, సిరాజ్ ను కావాలని పక్కన పెట్టలేదని.. జట్టు కూర్పులో భాగంగానే అలా చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.
జట్టును ఎంపిక చేసే సమయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ తెలిపారు. అన్ని విభాగాల్లో పటిష్ఠమైన తుది జట్టును బరిలోకి దింపాలన్నదే యాజమాన్యం ఉద్దేశమని చెప్పారు. సిరాజ్ విషయంలో ఎలాంటి సమస్య లేదని, అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని వివరించారు. శ్రీలంకలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, న్యూజిలాండ్‌లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.
జట్టులో ఇద్దరు బౌలర్లు బంతిని స్వింగ్ చేయగలరని, మరో ఇద్దరు సీమ్ బౌలింగ్‌తో ప్రభావం చూపగలరని వివరించారు. వీరు బంతిని వేగంగా సంధించగలరని తెలిపారు. న్యూజిలాండ్ జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ప్రత్యర్థి బ్యాటింగ్ కూర్పును దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ వ్యూహాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
మరోవైపు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రదర్శనపైనా కొటక్ స్పందించారు. ప్రసిద్ధ్ దూకుడుగా బౌలింగ్ చేసే ఆటగాడని, వికెట్లు తీసే ప్రయత్నంలో కొన్నిసార్లు పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుందని చెప్పారు. అతడు వికెట్లు తీసినప్పుడు ప్రశంసిస్తారని, పరుగులు ఇచ్చినప్పుడు విమర్శిస్తారని వ్యాఖ్యానించారు.
ఇదిలాఉంటే.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 82 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి ఆరో వికెట్‌కు 173 పరుగులు జోడించారు.. తద్వారా భారత బౌలర్లను విసిగించారు. తొలిరోజు ఆటలో భారత బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా మినహా మిగతా బౌలర్లు వికెట్లు తీయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుమ్రా మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ లు చెరో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో భారత ఫాస్ట్ బౌలర్ మహమద్ సిరాజ్‌ను పక్కన పెట్టడంపై క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు.