Navodayam, 19 నవంబర్ 2026: న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ కోర్టు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ అధిపతి సామంత్ గోయల్‌కు సమన్లు ఢిల్లీ కోర్టుల ద్వారా అందజేయాలని ఆదేశించింది. ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ దాఖలు చేసిన సివిల్ దావాకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. నవంబర్ 13న జారీ చేసిన ఆదేశాల్లో న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ యు.ఎస్. డిస్ట్రిక్ట్ కోర్టు క్లర్క్‌కు సమన్లు, సంబంధిత న్యాయ పత్రాలను పంపాలని సూచించింది. డోభాల్‌కు పటియాలా హౌస్ జిల్లా కోర్టు, గోయల్‌కు ద్వారక, తీస్‌హజారీ జిల్లా కోర్టుల ద్వారా వాటిని అందజేయాలని పేర్కొంది.
ఈ కోర్టు ఎదుట పెండింగ్‌లో ఉన్న సివిల్ దావాలో ప్రతివాదులకు న్యాయపత్రాలు అందజేయడంలో సహకరించాలని సంబంధిత భారత కోర్టులను గౌరవపూర్వకంగా కోరుతున్నాం అని న్యాయమూర్తి కేథరిన్ పోల్క్ ఫైలా ఆదేశాల్లో పేర్కొన్నారు. హేగ్ కన్వెన్షన్లు, భారత సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ)లోని సంబంధిత నిబంధనలను ప్రస్తావిస్తూ.. విదేశీ కోర్టులు భారత కోర్టుల ద్వారా డోభాల్, గోయల్‌కు సమన్లు అందజేయవచ్చని ఫైలా తెలిపారు.
తనను హతమార్చేందుకు భారత అధికారులు ప్రయత్నించారంటూ పన్నున్ దాఖలు చేసిన సవిల్ దావా విచారణలో భాగంగా ఫెడరల్ కోర్టు తాజా చర్యలు తీసుకుంది. అయితే ఈ పిటిషన్‌లోని ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. తమ ఉన్నతాధికారులపై చేసిన కల్పిత, దురుద్దేశపూరిత దాడులను తిరస్కరిస్తున్నామని, భారత్‌లో న్యాయపత్రాలు అందజేయాలన్న అభ్యర్థనను భారత నిర్దేశిత కేంద్ర అధికార సంస్థ అయిన న్యాయ, న్యాయశాఖ ద్వారానే పంపించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నవంబర్ 10న తెలిపారు.