Navodayam, 25 నవంబర్ 2026: మొత్తం 117 స్థానాలకు కలిసి పోటీ
సీఎం పదవి అకాలీ దళ్కే: అమిత్‌షా
ప్రజానుకూల పాలన అందిస్తామన్న ప్రధాని మోడీ
PTI: న్యూఢిల్లీ/చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శిరోమణి అకాలీదళ్ మళ్లీ చేతులు కలిపాయి. ఆరేళ్ల విరామం తర్వాత ఎన్డీఏలోకి అకాలీదళ్ తిరిగి చేరింది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు.
న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ కూటమిలో అకాలీదళ్దే పెద్దన్న పాత్ర అని, ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఆ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. అయితే సీట్ల పంపకంపై నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వెల్లడించారు.
2020లో తెగిన బంధం మళ్లీ ఒక్కటైంది
బీజేపీతో 24 ఏళ్లుగా కొనసాగిన పొత్తును 2020 సెప్టెంబరులో అకాలీదళ్ తెంచుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి వైదొలిగింది. ఇప్పుడు ఆ చట్టాలు రద్దయిన నేపథ్యంలో మళ్లీ కూటమిలో చేరింది. ప్రధాని మోదీ సోమవారమే అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి, పార్టీ తిరిగి ఎన్డీఏలోకి రావడంపై సంతోషం వ్యక్తం చేసినట్లు అమిత్ షా తెలిపారు.
ప్రధాని మోడీ హర్షం
గురునానక్ దేవ్ జయంతి (ప్రకాశ్ పురబ్) సందర్భంగా అకాలీదళ్ ఎన్డీఏ కుటుంబంలోకి తిరిగి రావడం ఆనందంగా ఉందని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, ప్రకాశ్ సింగ్ బాదల్‌ల నేతృత్వంలో బలపడిన బీజేపీఅకాలీదళ్ బంధం కాలపరీక్షను తట్టుకుని నిలిచిందన్నారు. ఈ కూటమి పంజాబ్ ప్రజల ఆదరణ పొందుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
కూటమి ప్రధాన అజెండా ఇదే: అమిత్‌షా
పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యను నిర్మూలించడం, రైతుల సంక్షేమం, హిందూసిక్కు ఐక్యతను బలోపేతం చేయడం కూటమి ప్రాధాన్య అంశాలని అమిత్ షా తెలిపారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తాయని చెప్పారు.
ఈ పొత్తు రాజకీయపరమైనదే కాకుండా భావోద్వేగపూరితమైనదని సుఖ్బీర్ సింగ్ బాదల్ అభివర్ణించారు. గతంలో ఈ కూటమి అధికారంలో ఉన్నప్పుడు పంజాబ్ అభివృద్ధి, శాంతి సామరస్యాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి సింగిల్ డిజిట్ స్థానాలు కూడా దక్కవని వ్యాఖ్యానించారు.
అధికార దాహంతోనే పొత్తులు: కేజ్రీవాల్
బీజేపీ, అకాళీదళ్ పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గుప్పించింది. అధికారం కోసం బీజేపీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. తమ పొత్తు పంజాబ్ ప్రజలతోనేనని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని అన్నారు. బీజేపీఅకాలీదళ్ పొత్తు అధికార దాహంతో ఏర్పడిందని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్గత్ సింగ్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ రెండు పార్టీలకు స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు.
బీజేపీఅకాలీదళ్ కూటమి గతంలో 2007 నుంచి 2017 వరకు, అంతకుముందు 1997 నుంచి 2002 వరకు పంజాబ్‌లో అధికారంలో కొనసాగింది. తాజా పొత్తుతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది.