Navodayam, 23 నవంబర్ 2026: న్యూఢిల్లీ: తీవ్రమైన ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐదు న్యూట్రాస్యూటికల్, హెల్త్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎఐ) ప్రకటించింది. పరిశుభ్రత లోపించడం, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వంటి కారణాలతో వేదాంత్ రెమెడీస్, లూసిడ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, అంబికో ఆయుర్వేదిక్ హెల్త్‌కేర్, విటామెడిక్ హెల్త్ న్యూట్రాస్యూటికల్స్, అడోరియల్ హెల్త్‌కేర్ సంస్థలపై ఈ చర్యలు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా సంస్థ వెల్లడించింది.
ఆహార భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఎఫ్ఎస్ఎస్ఎఐ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో కూడా వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన ఐరెన్ హెర్బల్స్, ఆక్వాబ్లిస్ లైఫ్ సైన్సెస్, రాస్కమ్ హెల్త్‌కేర్, సూపర్క్యూర్ బయోటెక్, అంబికో ఆయుర్వేదిక్ హెల్త్‌కేర్, వేదాంత్ రెమెడీస్ అనే ఆరు సంస్థలపై నియంత్రణ చర్యలు తీసుకుని లైసెన్సులు రద్దు చేశారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించేందుకు ఈ ఏడాది ఆహార వ్యాపార సంస్థలు, ఇ-కామర్స్ కంపెనీలు, మద్యం, ఎనర్జీ డ్రింక్ తయారీదారులపై ఎఫ్ఎస్ఎస్ఎఐ నిఘా పెంచి కఠిన చర్యలు చేపడుతోంది.