Navodayam, 20 నవంబర్ 2026: బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించడం కంటే నియంత్రణే మేలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్నాటకలో బైక్ ట్యాక్సీలకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నిషేధాన్ని పునరుద్ధరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను శుక్రవారం కొట్టివేసింది. దీంతో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలకు ఊరట లభించింది. జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, బీమాపై ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలను నిబంధనలతో పరిష్కరించవచ్చని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని 25 రాష్ట్రాల్లో బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయని గుర్తుచేసింది. జీపీఎస్‌తో మహిళల భద్రత మెరుగుపడుతుందని,
ఆటోలతో పోలిస్తే బైక్ ట్యాక్సీల చార్జీలు తక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించింది.2025 జూన్‌లో కర్నాటకలో నిలిచిపోయిన ఈ సేవలకు ఈ ఏడాది జనవరి 23న హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతిచ్చింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా నమోదు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో బైక్ ట్యాక్సీల నిర్వహణకు మార్గం సుగమమైంది. అయితే పర్మిట్లు, బీమా, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.