Navodayam, 19 నవంబర్ 2026: IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కివీస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా.. ప్రారంభంలోనే వరుస వికెట్లు కోల్పోయింది.
కొత్త బంతితో బౌలింగ్‌కు దిగిన జస్ర్పీత్ బుమ్రా అద్భుత బంతులతో కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి ఓవర్ మూడో బంతికే న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. బుమ్రా వేసిన బంతి తొలుత ఆఫ్‌స్టంప్‌కు వెలుపలికి వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో లాథమ్ దానిని వదిలేయాలని భావించాడు. అయితే, పిచ్‌పై పడిన తర్వాత బంతి అనూహ్యంగా లోపలికి స్వింగ్ అవుతూ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి దూసుకెళ్లి ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టింది. దీంతో లాథమ్ కు ఏమి జరిగిందో అర్ధంకాక ఆశ్చర్యంగా చూస్తూ కొద్దిసేపు క్రీజులోనే ఉండిపోయాడు. దీంతో లాథమ్ రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తొలి సెషన్లో బుమ్రా తన బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. లాథమ్‌తో పాటు మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. రచిన్ రవీంద్ర ఔట్ అయిన తరువాత డారిన్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. బూమ్రా వేసిన బౌలింగ్‌లో యశస్వీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేవలం మిచెల్ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన టామ్ బ్లన్డెల్ను బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో పెవిలియన్ బాట పట్టించాడు. శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి టామ్ పెవిలియన్ బాటపట్టాడు. ఫలితంగా తొలిరోజు ఆటలో బుమ్రా అద్భుత బంతులతో మూడు వికెట్లు పడగొట్టాడు.
భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కాంబోజ్, ఆకాష్ దీప్ కూడా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 74 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే, ఫస్ట్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్‌లు క్రీజులో పాతుకుపోయి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచారు. ఈ క్రమంలో హెన్రీ నికోల్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.