Navodayam, 27 నవంబర్ 2026: 
తమిళనాడులో టీవీకె విజయ్ పార్టీకి చెందిన కళ్లకురిచ్చి (Kallakurichi) నియోజకవర్గ ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్ను పోలీసులు అరెస్ట్ చేసారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ అయిన మహిళా ఐఏఎస్ అధికారిణిని వేధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసారు. మహిళా కలెక్టర్కు వాట్సాప్లో అసభ్యకరమైన సందేశాలు పంపడం, ఆమె రూపం, వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బహిరంగ కార్యక్రమాల్లో అసభ్యంగా ప్రవర్తించడంపై ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాదు రాత్రి సమయంలో మద్యం మత్తులో సదరు అధికారిణి అధికారిక నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత ఐఏఎస్ అధికారిణి నవంబర్ 23న తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై కళ్లకురిచ్చి మహిళా పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 75 (లైంగిక వేధింపులు), 78(2) (వెంబడించడం), 132 (ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడం), పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవడంలో జాప్యంపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించడం, ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించడంతో పోలీసులు విఘ్నేష్ను కళ్లకురిచ్చిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడినవని ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ ఖండించారు. ఈ వ్యవహారం కాస్తా విజయ్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.