Navodayam, 25 నవంబర్ 2026: అపార్ట్మెంట్ వద్ద శుభ్రం చేసేందుకు దిగిన యువకులు
ఊపిరాడక మృత్యువాత
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో విషాదం
మన తెలంగాణ/నిజాంపేట్: ఎస్టీపీ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ముగ్గురు యువకులు మృతి చెందిన విషాద సంఘటన బాచుపల్లిలోని దినేశ్ఔరిక్ అపార్టుమెంట్లో మంగళశారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అపార్ట్మెంట్ అధ్యక్షుడు ఎస్టీపీని శుభ్రం చేసేందుకు బ్రోకర్ రవికి పని అప్పగించాడు. దీంతో రవి తనకు తెలిసిన షణ్ముఖకు విషయం తెలుపగా, షణ్ముఖ తన బంధువులైప పవన్, సురేశ్‌తో కలిసి దినేశ్ ఔరిక్ అపార్టుమెంట్ వద్దకు వెళ్లాడు.
ఈ క్రమంలో తొలుత షణ్ముఖ ఎస్టీపీలోకి దిగి శుభ్రం చేస్తుండగా, లోపలి నుంచి కేకలు వినిపించాయి. వెంటనే పవన్ లోపలికి వెళ్లి చూడగా షణ్ముఖ అపస్మారక స్థితిలో కనిపించాడు. కొద్దిసేపటికే పవన్ కూడా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం సురేశ్ లోపలికి వెళ్లగా అతడు కూడా బయటకు రాలేదు. దీంతో ఆందోళనకు గురైన బ్రోకర్ రవి అక్కడి నుంచి పరారయ్యాడు. అపార్టుమెంట్ అధ్యక్షుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు.
ఎస్టీపీలో చిక్కుకున్న ముగ్గురిని ఎన్డీఆర్ సిబ్బంది సుమారు మూడు గంటల శ్రమించి బయటకు తీశారు. అయితే విషయం తెలుసుకున్న మృతుల బంధువుల అక్కడకు చేరుకొని ఆందోళన చేపట్టారు. మృతదేహాలను చూసేందుకు అపార్ట్మెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. పోలీసులు అపార్ట్‌మెంట్‌వాసులు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తమకు చెప్పకుండా మృతదేహాలను ఆసుపత్రికి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని ఘటనపై ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ముగ్గురి మృతికి విషవాయువులే కారణమా?
సెప్టిక్ ట్యాంకులు, ఎస్టీపీల్లో మురుగునీటి వ్యర్థాలు కుళ్లడం వల్ల హైడ్రోజన్ స్ఫడ్, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు ఏర్పడే అవకాశం ఉంది. వీటితో పాటు ఆక్సిజన్ స్థాయి తగ్గితే ఊపిరాడక స్పృహ కోల్పోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ వాయువుల ప్రభావంతోనే ముగ్గురూ మృతిచెందారా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.