Navodayam, 24 నవంబర్ 2026: 
మానవుడు పుట్టినప్పుడు తనతో ఏమీ తీసుకురాడు, అలాగే పోయేటపుడు ఏదీ తీసుకెళ్లలేడు. ఆదిభిక్షువు ఆ శివయ్య చెప్పేది ఇదే. ఒకనాడు ఆ పరమేశ్వరుడు తన కలలో కన్పించి తన సేవలో తరించమని, ఆలయాలకు సేవ చేయాలని గోర్లి నరసయ్యమ్మకి చెప్పారట. దాంతో ఆమె సుమారు 30 ఏళ్ల క్రితం తిరుపతి నుండి తునికి వలస వచ్చి, ప్రస్తుతం గొల్లఅప్పారావు సెంటర్ సమీపంలోని శివాలయం వద్ద భిక్షాటన చేస్తూ వుంది. ఐతే ఆమెకు భిక్షగా లభించిన ప్రతి రూపాయిని పవిత్రమైనదిగా భావించి భద్రపరుస్తున్నారు.
అలా గత మూడు దశాబ్దాలుగా ఆలయాల అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాలకు లక్షలాది రూపాయలను విరాళంగా ఇస్తూ వస్తున్నారు. తునిలోని దరలమ్మ ఆలయంలో భారీ త్రిశూలాన్ని తయారు చేయించడానికి రూ. 1 లక్ష విరాళంగా ఇచ్చారు. శ్రీశైలంలోని ప్రసిద్ధ భ్రమరాంబికా దేవికి బంగారు కళ్లను సమర్పించారు. ఇతర మూడు ఆలయాలకు ఒక్కొక్క దానికి రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు విరాళం అందించారు.
అంతేకాకుండా, గత ఏడాది అన్నదానం కోసం నాలుగు బస్తాల బియ్యాన్ని, ఈ ఏడాది ఆలయ పునరుద్ధరణ పనుల కోసం రూ 50,000ను విరాళంగా ఇచ్చారు. దరలమ్మ ఆలయ అధ్యక్షుడు తిరుమలశెట్టి సత్తిబాబు- కార్యదర్శి పల్లెల నాగేశ్వరరావు ఆమె నిస్వార్థ గుణాన్ని కొనియాడారు. ఆమె పరిస్థితిని చూసి చాలామంది చిన్నచూపు చూసినప్పటికీ, ఆమె హృదయంలో అత్యంత స్వచ్ఛమైన భక్తి, దాతృత్వం ఉన్నాయని వారు ప్రశంసించారు.
లక్షలాది రూపాయలను విరాళంగా ఇచ్చినప్పటికీ, నరసయ్యమ్మ నేటికీ ఆలయాల వద్ద తన సాధారణ జీవనాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తన దగ్గర మిగిలే ప్రతి రూపాయిని తదుపరి పవిత్ర కార్యానికి సమర్పించేందుకు పొదుపు చేస్తున్నారు. ఆలయాల ఉద్ధరణకు ఆమె భిక్షాటన చేసి ఇస్తున్న విరాళాల విషయం ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.