Navodayam, 24 నవంబర్ 2026: 
చదువులు నేర్పించాల్సిన గురువుల్లో కొంతమంది కామాంధులుగా మారుతున్నారు. ఇట్లాంటి వారివల్ల విద్యా వ్యవస్థలో ఎంతో గౌరవం పొందుతున్న గురువులకు చెడ్డపేరు వస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడు తన క్లాసు విద్యార్థినికి వాట్సప్ ద్వారా అసభ్య సందేశాలు పంపాడు. వివరాలు ఇలా వున్నాయి.
సంగారెడ్డి జిల్లా పటేల్ గూడలోని ఎల్లంకి పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది ఓ విద్యార్థిని. ఈ విద్యార్థినికి కళాశాల ఆంగ్ల లెక్చరర్ వాట్సప్ ద్వారా అసభ్య సందేశాలు పంపినట్లు తేలింది. వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ కావడంతో అది చూసిన విద్యార్థులు లెక్చరర్ పైన దాడి చేసారు. దీనితో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు లెక్చరర్ పైన పోక్సో కేసు నమోదు చేసారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.