Navodayam, 24 నవంబర్ 2026: 
సొంతూరిపై మమకారం తుదిశ్వాస ఉన్నంత వరకు ఉంటుంది. ఆ మమకారమే గతంలో ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ జీవిత చరమాంకంలో మాత్రం సొంతూరుకి వెళ్లి ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఒకపుడు జిల్లా కలెక్టరుగా పని చేసిన వ్యక్తి గ్రామాభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్ అయ్యారు. ఆ తర్వాత గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. పేదలకు వందకుపైగా గృహాలు నిర్మించారు. ఆ కాలనీకి ఇపుడు మునిరత్నం నగర్‌గా పిలుస్తున్నారు. ఆ వ్యక్తి భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన సేవలు మాత్రం నిత్యం సజీవంగా ఉన్నాయి. ఫలితంగా నేటి సర్పంచులకు ఆదర్శంగా నిలించారు. ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈ ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తాళ్వాయిపాటి మునిరత్నం. గతంలో చిత్తూరు జిల్లా కలెక్టరుగా, ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టురుగా, ఆ తర్వాత కర్నూరు కలెక్టరుగా పని చేశారు. ఆ సమయంలో ఆయన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎనలేని కృషి చేసి ప్రజాభిమాన్ని సొంతం చేసుకున్నారు.
పదవీ విరమణ అనంతరం స్వగ్రామం నాయుడుపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. రెండున్నర సంవత్సరాల పాటు నాయుడుపేట (ఇపుడు మున్సిపాలిటీ) గ్రామ సర్పంచిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రాజీనామా చేశారు.
సర్పంచిగా పని చేసిన కాలంలో పంచాయతీ కార్యాలయానికి పక్కా భవనం, ఊరికి దగ్గరలో పదెకరాలు సేకరించి నిరుపేదలకు వంద వరకు గృహాలు నిర్మించేందుకు చొరవ చూపించారు. ఆ కాలనీని నేడు మునిరత్నం నగర్‌గా పిలుస్తున్నారు. పట్టణంలోని ఖాళీ స్థలాల్లో అప్పట్లో ఎన్.జే.ఆర్, ఎస్వీ వాణిజ్య సముదాయాలను నిర్మించి, పంచాయతీకి ఆదాయం సమకూరేలా చేసి ఇతర సర్పంచులకు ఆదర్శంగా నిలిచారు.