Navodayam, 23 నవంబర్ 2026: IND vs PAK Asia Cup Rising Stars 2026 : ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టుకు పాకిస్థాన్ -ఎ జట్టు భారీ షాకిచ్చింది. పాక్ బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు లక్ష్య చేధనలో చేతులెత్తేశారు. ప్రారంభంలో అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడినా.. కెప్టెన్ తిలక్ వర్మ సెంచరీ చేసినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయారు. ఫలితంగా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో 48 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఎ వర్సెస్ పాకిస్థాన్-ఎ జట్ల మధ్య జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో టీమిండియాకు నిరాశ ఎదురైంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్-ఎ జట్టు విజయాన్ని నమోదు చేసింది.
టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 49.2 ఓవర్లకు 313 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బ్యాటర్లలో హసన్ నవాజ్ 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఫర్హాన్ యూసఫ్ 56 పరుగులు, మాజ్ సదాకత్ 59 పరుగులతో రాణించారు. దీంతో భారత్ ముందు 314 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఆయుష్ బదోనీ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. దీంతో 42 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ ఔటైన తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. రింకూ సింగ్ కూడా నిరాశపరిచాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ తిలక్ వర్మ మాత్రం పోరాటం కొనసాగించాడు. 149 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. అతడికి షాబాజ్ అహ్మద్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి 10 ఓవర్లలో 91 పరుగులు చేస్తే భారత జట్టుదే విజయం. కానీ, మ్యాచ్ నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్న సమయంలో ఇన్నింగ్స్ 44వ ఓవర్లో అలీ రాజా వరుస బంతుల్లో షాబాజ్ అహ్మద్ (56), విప్రాజ్ నిగమ్ (0)లను ఔట్ చేసి భారత్‌ను దెబ్బతీశాడు.
ఆ తరువాత క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా కూడా డకౌట్‌తో పెవిలియన్ బాటపట్టాడు. చివరకు 49.1 ఓవర్లలో 265 పరుగులకు భారత్ – ఎ జట్టు ఆలౌట్ అయింది. తిలక్ వర్మ సెంచరీ చేసినప్పటికీ కావాల్సినంత వేగంతో ఆడలేకపోవడంతో భారత్ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో పాకిస్థాన్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ తరఫున హసన్ నవాజ్ బ్యాటింగ్‌లో 79 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.