Navodayam, 23 నవంబర్ 2026: Godavari Pushkaralu 2027: ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘గోదావరి పుష్కరాలు-2027’ కోసం ఆకర్షణీయమైన లోగో (Logo), ట్యాగ్‌లైన్ (Tagline) రూపొందించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ పోటీలను ప్రకటించింది. కళాకారులు, డిజైనర్లు, సృజనాత్మకత కలిగిన ఔత్సాహికుల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈ పోటీలకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU)లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు.

Godavari Pushkaralu 2027: నవంబర్ 30 వరకు గడువు.. భారీ నగదు బహుమతులు
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా వినూత్న లోగోలు, ట్యాగ్లైన్లను రూపొందించి తమ సృజనాత్మకతను చాటుకోవాలని ఔత్సాహిక డిజైనర్లకు పిలుపునిచ్చారు.
- ప్రథమ బహుమతి: రూ. 1,00,000 (లక్ష రూపాయలు)
- ద్వితీయ బహుమతి: రూ. 50,000
- తృతీయ బహుమతి: రూ. 25,000
ఆసక్తి గలవారు తమ లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్లను కలిపి godavaripushkaralutg@gmail.com మెయిల్ ఐడీకి పంపించాలని అధికారులు సూచించారు. నవంబర్ 21 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ ఎంట్రీల స్వీకరణ నవంబర్ 30 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
ఘనంగా ఏర్పాట్లు
12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26న ప్రారంభం కానున్నాయి. ఉత్తర భారతదేశంలో జరిగే కుంభమేళా తరహాలో ఈ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా సదుపాయాలు, రహదారులు, ఇతర మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరింది.