Navodayam, 21 నవంబర్ 2026: కరోనావ్యాప్తి వరకు అమెరికాకు ప్రధాన ఎగుమతి దారు చైనాయే
ఇప్పుడు పరిశోధనలకు పెద్ద సమస్యగా మారిన కోతుల కొరత
కంబోడియా నుంచి పెరిగిన దిగుమతులు
మన తెలంగాణ/సైన్స్ డెస్క్: సూది నుంచి సూపర్ కంప్యూటర్ వరకు.. బొమ్మల నుంచి అత్యాధునిక యంత్రాల వరకు ప్రపంచానికి ఏది కావాలన్నా ఎగుమతి చేసే చైనా ఇప్పుడు కోతుల కొరతను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు వైద్య పరిశోధనల కోసం అమెరికాకు పెద్దఎత్తున కోతులను ఎగుమతి చేసిన చైనా.. ఇప్పుడు తన పరిశోధనల అవసరాల కోసం కంబోడియా నుంచి వేలాది కోతులను దిగుమతి చేసుకుంటోంది. ప్రముఖ శాస్త్రీయ పత్రిక సైన్స్ వెల్లడించిన ఈ పరిణామం అంతర్జాతీయ పరిశోధన రంగంలో చర్చకు దారితీసింది.
ఎగుమతిదారు దిగుమతిదారుగా ఎందుకు మారింది?
కరోనా మహమ్మారి ప్రారంభానికి ముందు వైద్య ప్రయోగాలకు అవసరమైన కోతుల సరఫరాలో చైనా కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా అమెరికాలో ఔషధాలు, టీకాల పరిశోధనలకు చైనా నుంచి కోతులు వెళ్లేవి. అయితే 2020లో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత చైనా కోతుల ఎగుమతులను నిలిపివేసింది. దీంతో అమెరికా ప్రత్యామ్నాయ సరఫరాదారుగా కంబోడియా వైపు మళ్లింది.
మరోవైపు చైనాలో ఔషధ పరిశోధనలు, జీవసాంకేతిక ప్రయోగాలకు అవసరమైన కోతుల డిమాండ్ పెరిగింది. దేశీయంగా అందుబాటులో ఉన్న కోతులతో ఆ అవసరాలను తీర్చుకోవడం కష్టమవుతున్న నేపథ్యంలో చైనా విదేశీ సరఫరాపై ఆధారపడుతున్నట్లు తాజా వాణిజ్య గణాంకాలు సూచిస్తున్నాయి.అమెరికాకు ప్రత్యామ్నాయ సరఫరాదారుగా మారిన కంబోడియా నుంచే ఇప్పుడు చైనా కోతులను దిగుమతి చేసుకుంటోంది.
కోతుల వ్యాపారంలో మరో వివాదం
2022లో కంబోడియా నుంచి కోతుల అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలు అంతర్జాతీయంగా కలకలం సృష్టించాయి. అడవుల్లో పట్టుకున్న కోతులను పెంపకం కేంద్రాల్లో పుట్టినవిగా చూపించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
కోతుల కోసం ఇంత పోటీ ఎందుకు?
మనుషులకు జీవశాస్త్రపరంగా దగ్గరగా ఉండే మకాక్ జాతి కోతులను కొన్ని రకాల ఔషధాలు, టీకాలు, వ్యాధుల చికిత్సల పరిశోధనల్లో ఉపయోగిస్తారు. వాటి సరఫరా తగ్గితే ప్రయోగాల వ్యయం పెరగడంతోపాటు పరిశోధన కార్యక్రమాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. దీంతో కోతుల మూలాలు, వాటి పెంపకం కేంద్రాల విశ్వసనీయత, వన్యప్రాణుల సంరక్షణపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు కంబోడియా నుంచి చైనా దిగుమతులు పెరగడం ఈ వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.