Navodayam, 20 నవంబర్ 2026: మన తెలంగాణ – వరల్డ్ డెస్క్: అమెరికాలో ఓ పోస్టుమ్యాన్ రోజూ పాడే పాటలు ఓ వృద్ధురాలి ఒంటరితనాన్ని దూరం చేశాయి. అనుకోకుండా ఆ పాట వీడియో వైరల్ కావడంతో అతడి జీవితమే మారిపోయింది. ఇతరులకు ఆనందాన్ని పంచిన అతడికి నెటిజన్లు అండగా నిలిచి ఆర్థిక సాయం అందించారు.
ఒంటరి బామ్మకు పాటే ఓదార్పు
ఆస్టిన్ ప్రాంతంలో డెలివరీ విధులు నిర్వహించే లవోంటే హార్వే అనే పోస్టుమ్యాన్.. రోజూ ఓ ఇంటి ముందు పాటలు పాడుతూ వెళ్లేవాడు. ఆ ఇంట్లో ఉండే 76 ఏళ్ల వాండా ఇటీవల 50 ఏళ్ల భర్తను కోల్పోయింది. క్యాన్సర్ చికిత్స కూడా తీసుకుంటున్న ఆమెకు లవోంటే పాటలు కొంత ఆనందాన్ని ఇచ్చేవి.
ఒక్క వీడియోతో మారిన పరిస్థితి
ఓ రోజు ‘ఇది మీ కోసమే బామ్మ’ అంటూ లవోంటే జమాల్ రాబర్ట్స్ పాడిన ‘మిసిసిప్పి’ పాటను ఆలపించాడు. ఈ దృశ్యాలు డోర్‌బెల్ కెమెరాలో రికార్డయ్యాయి. వాండా మనవరాలు విట్నీ కుంబో ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. 1.4 కోట్లకు పైగా వ్యూస్, వేలాది కామెంట్లు వచ్చాయి.
పోస్టుమ్యాన్ కష్టాలు తెలుసుకుని విరాళాలు
లవోంటే కూడా డిప్రెషన్‌తో ఇబ్బందిపడేవాడు. విధులకు వెళ్లి రావడానికి రోజూ బస్సు, రైలులో సుమారు ఐదు గంటలు ప్రయాణించాల్సి వచ్చేది. పాటలు పాడటం అతడికి మానసికంగా ఉపశమనాన్ని ఇచ్చేది. ఈ విషయం తెలుసుకున్న విట్నీ గోఫండ్‌మీ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించింది. నెటిజన్లు స్పందించి సుమారు 8 వేల నుంచి 10 వేల డాలర్ల వరకు విరాళాలు అందించారు.
రోజుకు నాలుగు గంటల సమయం ఆదా
విరాళాలతో లవోంటే ఓ వాహనం కొనుగోలు చేశాడు. దీంతో గతంలో గంటల తరబడి సాగిన ప్రయాణం ఇప్పుడు సుమారు 30 నిమిషాలకు తగ్గింది. గుడ్ మార్నింగ్ అమెరికా, ఏబీసీ7 కార్యక్రమాల్లోనూ అతడికి గుర్తింపు లభించింది. తనకంటూ ఓ దుస్తుల బ్రాండ్‌ను కూడా ప్రారంభించాడు. ఓ వృద్ధురాలికి ఆనందం పంచాలనే ఉద్దేశంతో పాడిన పాట.. చివరకు పోస్టుమ్యాన్ జీవితానికే కొత్త దారి చూపించింది. ఒకరి బాధను తగ్గించిన చిన్న ప్రయత్నం.. మరో వ్యక్తి కష్టాలను తీర్చేలా మారడం నెటిజన్లను కదిలిస్తోంది.