Navodayam, 19 నవంబర్ 2026: బంగారం ధరలు తగ్గుతుండటంతో బంగారంపై రుణాలు తీసుకున్నవారిలో ఆందోళన పెరుగుతోంది. గతంలో ధరలు అధికంగా ఉన్నప్పుడు నగలను తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నవారికి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. తాకట్టు బంగారం విలువ తగ్గిపోవడంతో రుణం, బంగారం విలువ మధ్య నిష్పత్తి పెరుగుతోంది.దీంతో కొన్ని బ్యాంకులు, బంగారు రుణ సంస్థలు ఖాతాదారులకు నోటీసులు పంపిస్తూ అదనపు మొత్తాన్ని చెల్లించాలని లేదా మరికొంత బంగారాన్ని తాకట్టు పెట్టాలని కోరుతున్నాయి. ఇచ్చిన నోటీసులకు సకాలంలో స్పందించకుంటే తాకట్టు పెట్టిన నగలను వేలం వేస్తామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. బంగారం విలువ లక్ష రూపాయలు ఉన్నప్పుడు దానిపై రూ.75 వేల వరకు రుణం పొందినవారు ధరలు గణనీయంగా తగ్గినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. బంగారం విలువ పడిపోయినా తీసుకున్న రుణం మాత్రం తగ్గదు. దీనివల్ల రుణదాతలకు నష్టభయం పెరుగుతోంది.
గడువులోగా చెల్లింపులు చేయని ఖాతాదారుల విషయంలో తాకట్టు నగల వేలం ప్రక్రియ చేపట్టే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ బంగారు రుణాలు తీసుకున్న కుటుంబాలు ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, వ్యాపార అవసరాల కోసం నగలను తాకట్టు పెట్టిన మధ్యతరగతి ప్రజలకు ఈ పరిస్థితి భారంగా మారుతోంది.అయితే బంగారం ధర తగ్గినంత మాత్రాన ప్రతి ఖాతాదారుడికి నోటీసులు పంపడం లేదు. రుణ ఒప్పందం, బకాయి మొత్తం, తాకట్టు బంగారం ప్రస్తుత విలువ ఆధారంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకుంటాయి. నోటీసులు అందుకున్నవారు వాటిని నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించి చెల్లింపులకు గడువు, ఇతర వెసులుబాట్ల గురించి తెలుసుకోవాలి. ‘తాకట్టు పెట్టాం కదా.. బ్యాంకులో చూసుకుంటారని’ నిర్లక్ష్యం చేస్తే నగలు పోయి, వడ్డీలు పెరుగుతాయి. ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి.