Navodayam, 18 నవంబర్ 2026: Sonia Biography Book : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలపై ఏక్నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ గురించి పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు ఆయనను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. సావర్కర్ హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించినట్లుగా పుస్తకంలో రాశారని శివసేన నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా బాలాసాహెబ్ ఠాక్రే గతంలో సావర్కర్‌ను హిందుత్వానికి ఆత్మగా అభివర్ణించేవారని గుర్తుచేశారు. సావర్కర్ సిద్ధాంతాలు, హిందుత్వ భావజాలం పట్ల శివసేనకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ సోనియా గాంధీ పుస్తకంలోని వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.

201, 443 పేజీలు తొలగించాలని డిమాండ్.. పుస్తకాన్ని చించి నిరసన!
ఈ వివాదం నేపథ్యంలో పుస్తకంలోని 201, 443 పేజీలను తొలగించాలని శివసేన నాయకులు ప్రచురణకర్తను డిమాండ్ చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని, సావర్కర్‌పై తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా ఉన్న అంశాలను సరిచేయాలని కోరారు. తమ నిరసనను తెలియజేస్తూ పుస్తకంలోని సంబంధిత పేజీలను చింపివేశారు. దీంతో సోనియా గాంధీ ఆత్మకథ చుట్టూ రాజకీయ దుమారం మొదలైంది. ఇప్పటికే సావర్కర్ చరిత్ర, హిందుత్వ సిద్ధాంతాలపై దేశవ్యాప్తంగా భిన్న రాజకీయ అభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుస్తకంలోని వ్యాఖ్యలు మరోసారి కాంగ్రెస్, శివసేన మధ్య రాజకీయ విమర్శలకు వేదికగా మారాయి. ఈ వివాదంపై పుస్తక ప్రచురణకర్తలు, కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.