- ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్..
- నకిలీ డిస్కౌంట్ల ఆటకు ఇక చెక్
- ఆన్లైన్ షాపింగ్‌లో భారీ మార్పులు..
- జనవరి 1 నుంచి కొత్త రూల్స్
Navodayam, 18 నవంబర్ 2026: Online Shopping Gets Safer : ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనాలనుకుంటే చాలు.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు, అదిరిపోయే ఆఫర్లు కనిపిస్తుంటాయి. రూ.5 వేల విలువైన వస్తువు రూ.999కే అంటూ ఆకర్షిస్తుంటాయి.
తీరా కొనుగోలు చేసిన తర్వాత చూస్తే అసలు ధరకు, డిస్కౌంట్ ధరకు పెద్దగా తేడా ఉండదు. ఇలాంటి ఆఫర్లతో కస్టమర్లను బురిడీ కొట్టించే ఈ-కామర్స్ కంపెనీలకు ఇకపై చెక్ పడనుంది. ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి మరింత భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకొస్తోంది.
2027 జనవరి 1 నుంచి అమల్లోకి :
ప్రస్తుతం చాలా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నాయి. ఫేక్ డిస్కౌంట్లు, స్పాన్సర్డ్ ప్రొడక్ట్స్, నకిలీ ఆఫర్లు, డార్క్ ప్యాటర్న్స్‌తో వినియోగదారులను ప్రభావితం చేస్తున్నాయి. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. ఈ మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం ఇకపై వస్తువులపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో చెప్పడంతో పాటు, గత 30 రోజుల్లో ఉన్న అత్యల్ప ధరను కూడా చూపించాలి. దీంతో నిజంగా ధర తగ్గించారా? లేక పాత ధరను పెంచి డిస్కౌంట్ పేరుతో మాయ చేస్తున్నారా? అనేది కస్టమర్లకు స్పష్టంగా తెలుస్తుంది.
స్పాన్సర్డ్ లేబుల్ తప్పనిసరి :
అలాగే సెర్చ్ చేసినప్పుడు కనిపించే పెయిడ్ ప్రమోషన్ వస్తువులకు స్పాన్సర్డ్ అనే లేబుల్ తప్పనిసరిగా చూపించాలి. దీంతో ఏది సాధారణ ప్రొడక్ట్, ఏది ప్రకటన ద్వారా ముందుకు తీసుకొచ్చిన వస్తువో సులభంగా గుర్తించవచ్చు.
మరోవైపు రీఫండ్లు, రిటర్నులు, ఆర్డర్ క్యాన్సిలేషన్ల విషయంలోనూ పారదర్శకత ఉండాలి. ఇందుకోసం కంపెనీలు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌తో అనుసంధానం కావాలి. వస్తువుల గడువు తేదీ, డెలివరీ సమయం, వారంటీ, గ్యారంటీ వివరాలు కూడా స్పష్టంగా అందించాలి.
డార్క్ ప్యాటర్న్స్‌కు స్వస్తి :
కస్టమర్లకు తెలియకుండానే అదనపు ఖర్చులు పెట్టించే డార్క్ ప్యాటర్న్స్‌కు కూడా స్వస్తి చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ-కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌పై వార్షిక ఆడిట్ నిర్వహించడంతో పాటు నిబంధనలు పాటిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని ప్రదర్శించాలి.
మొత్తానికి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే ఆన్లైన్ షాపింగ్‌లో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది. ఆఫర్ల పేరుతో మోసపోకుండా, తమ డబ్బుకు తగిన విలువ పొందేందుకు వినియోగదారులకు ఉపయోగపడనుంది.