IND vs NZ 2nd Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భాగంగా మూడోరోజు ఆటలో టీమిండియా బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఆట తీరును కనబర్చాడు. క్రీజులోకి వచ్చిన వారు వెంటవెంటనే పెవిలియన్ బాటపడుతుండగా.. జురెల్ క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, 88 పరుగుల వద్ద జురెల్ కూడా ఔట్ కావడంతో.. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో కివీస్ కంటే 110 పరుగులు వెనకబడి ఉంది.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు తరఫున టామ్ బ్లండెల్ 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టామ్ లాథమ్ 59 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. గర్నూర్ బ్రార్ రెండు, అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. రెండోరోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.
ఓవర్ నైట్ స్కోరు 116/6తో టీమిండియా మూడో రోజు ఆటను ప్రారంభించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధ్రువ్ జురెల్ మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. క్రీజులో పాతుకుపోయి న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడికి ఇది రెండో అర్ధ సెంచరీ కావడం విశేషం. గతంలో తొలి టెస్టులోనూ 78 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఆదివారం తొలి సెషన్లో అన్షుల్ కంబోజ్ (0)ను మ్యాట్ హెన్రీ ఔట్ చేశాడు. 29 పరుగులు చేసిన ఆకాశ్‌దీప్‌ను నాథమ్ స్మిత్ పెవిలియన్‌కు పంపించాడు. అయితే, ధ్రువ్‌కు ఆకాశ్ దీప్ కీలక సహకారం అందించాడు. వీరిద్దరి మధ్య 46 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అనంతరం గర్నూర్ బ్రార్‌తో కలిసి జురెల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కైల్ జేమీసన్ తన రెండో బంతికే గుర్నూర్ బ్రార్ (10)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆఫ్‌సైడ్ వేసిన బంతిని బ్రార్ వదిలేయగా.. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. ఆ తరువాత జస్ర్పీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్ (88) పరుగుల వద్ద ఔట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసింది.