Rishabh Pant : టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరో ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జాకబ్ డఫీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన పంత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ రికార్డును బ్రేక్ చేశాడు. స్టోక్స్ 64 మ్యాచ్‌ల్లో 117 ఇన్నింగ్స్‌ల్లో 88 సిక్సర్లు బాదగా పంత్ 44 మ్యాచ్‌ల్లో 76 ఇన్నింగ్స్‌ల్లో 89 సిక్సర్లు కొట్టాడు. ఇక ఈ జాబితాలో భారత ఆటగాడు రోహిత్ శర్మ 56 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో శుభ్‌మన్ గిల్ (48), యశస్వి జైస్వాల్ (45) ఉన్నారు.
డబ్ల్యూటీసీలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..
* రిషబ్ పంత్ (భారత్) – 89 సిక్సర్లు
* బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 88 సిక్సర్లు
* రోహిత్ శర్మ (భారత్) – 56 సిక్సర్లు
* శుభ్‌మన్ గిల్ (భారత్) – 48 సిక్సర్లు
* యశస్వి జైస్వాల్ (భారత్) – 45 సిక్సర్లు
పంత్ ఈ మైలురాయిని చేరుకున్నప్పటికి కూడా ఈ మ్యాచ్‌లో అతడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 39 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 1 సిక్స్ కొట్టి 23 పరుగులు సాధించాడు. డఫీ బౌలింగ్‌లో కైల్ జేమీసన్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (7) క్రీజులో ఉన్నాడు. కేఎల్ రాహుల్ (25), దేవ్‌దత్ పడిక్కల్ (21), శుభ్‌మన్ గిల్ (17), పంత్ (23)లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వాషింగ్టన్ సుందర్ (10) విఫలం అయ్యాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 240 పరుగులు వెనుకబడి ఉంది.