మన తెలంగాణ/హైదరాబాద్: కొందరు అధికారం శాశ్వతం చేసుకోవాలని రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, ఆ దాడిని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్లు అందించిన రాజ్యాంగమిదని తెలిపారు. ఓట్ల తొలగింపు ద్వారా నాలుగోసారి అధికారంలోకి రావాలని మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీలు దుష్ట చతుష్టయంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు పాలకులుగా ఉండాలో రాజ్యాంగం నిర్ణయించిందని, దురదృష్టవశాత్తూ ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నారని సీఎం అన్నారు.
కేంద్రం దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలకు చెందిన 13 కోట్ల ఓట్లను ఇప్పటికే తొలగించిందని, మరో 7 కోట్ల ఓట్ల తొలగింపునకు ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 90 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిపించాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు జరిగిన సంవిధాన్ రక్షక్ మార్చ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
యుద్ధాలు, హింస లేకుండా అహింసతో స్వాతంత్య్రం
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సాధించాలని, సమాన అవకాశాలు కల్పించాలని 1885లో కాంగ్రెస్ ఏర్పడిందన్నారు. ఎందరో ప్రాణత్యాగాలతో స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని మనకు అందించారని తెలిపారు. యుద్ధాలు, హింస లేకుండా అహింసతో స్వాతంత్య్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
గతంలో రాజులు చనిపోతే వారి కొడుకులు, తమ్ముళ్లు అధికారం పొందేవారని, పాలనను ప్రజల చేతుల్లో పెట్టాలంటే రాజ్యాంగం అవసరమని నెహ్రూ, అంబేడ్కర్ ఆలోచించి రాజ్యాంగాన్ని అందించారని సీఎం తెలిపారు. గిరిజనులు, దళితులు, మహిళలు, మైనార్టీలతోపాటు ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. తామంతా ప్రజలకు సేవకులమని, ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుని ఆశీర్వాదంతో ఈ వేదికపై ఉన్నానని అన్నారు. రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం ప్రజాస్వామ్యమని తెలిపారు.
మోసపూరిత హామీలతో మోడీ అధికారంలోకి..
అమెరికాకు 360 ఏళ్ల క్రితమే స్వాతంత్య్రం వచ్చినా, వందల ఏళ్ల వరకు మహిళలకు ఓటు హక్కు కల్పించలేదన్నారు. బీజేపీ నాయకులు నాడు పేదలు, మహిళలకు ఓటు హక్కు వద్దని వాదించారని, అంబేడ్కర్ మాత్రం అందరికీ ఓటు హక్కు కల్పించారని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్లధనం తెస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి మోడీ 2014లో అధికారంలోకి వచ్చారని, కులమత భేదాలు, తప్పుడు హామీలతో రెండోసారి, మూడోసారి అధికారంలోకి వచ్చారని సీఎం తెలిపారు.
గాడ్సే వారసత్వంతో మోడీ ముఠా పనిచేస్తోంది
ఈ దేశం కోసం గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేశారన్నారు. దేశ రక్షణ కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే, కెసి వేణుగోపాల్ గాంధీవాదంతో పోరాడుతుంటే.. గాడ్సే వారసత్వంతో మోడీ ముఠా పనిచేస్తోందని ఆరోపించారు. మనం గాంధీ కుటుంబం పక్షాన నిలవాలని, గాంధీ పక్షాన నిలిచి మోడీ కౌరవ సైన్యాన్ని ఓడించాలని అన్నారు. స్వాతంత్య్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని, అధికారం కోసం పుట్టిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.
వందేళ్ల క్రితం కాంగ్రెస్ ఉందని, ఇప్పుడు ఉందని, మరో వందేళ్లు ఉంటుందని, బీజేపీ నాడు లేదని, రేపు ఉంటుందో లేదో తెలియదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.