కరీంనగర్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉన్నది! తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్.. 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టంగా నిలిచింది. ఆ దీక్షతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
చివరికి కేంద్ర ప్రభుత్వం దొగొచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కేవలం ఒక తేదీని గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఉన్న చరిత్ర, త్యాగాలు, పోరాటాలు, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన మార్పులను మరోసారి సమీక్షించుకునే సందర్భం.
2009 నవంబర్ 29న ప్రారంభమైన దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. దీక్ష కొనసాగుతున్న కొద్దీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, కార్మికులు, వివిధ ప్రజాసంఘాలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా నిలిచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి పీ చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.
దాంతో కేసీఆర్ తన దీక్ష విరమించారు. ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు, రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో కేంద్రం డిసెంబర్ 23న తన వైఖరిని మార్చి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రకటించింది. దీంతో తెలంగాణ ఉద్యమం మరింత విస్తృతమైంది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటైంది. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సింగరేణి కార్మికులు, న్యాయవాదులు, ఇతర వర్గాలను ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో కేసీఆర్ పాత్ర మరువలేనిది.
మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి కార్యక్రమాలు ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. చివరికి పార్లమెంట్లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ ఆమోదం పొందడంతో 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఆ దీక్షతో మొదలైన పరిణామాలు.. ఆ తర్వాత సమష్టి ఉద్యమం.. చివరకు రాష్ట్ర ఆవిర్భావానికి దారితీశాయి. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో నూతన అధ్యాయం మొదలైంది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత చోటుచేసుకున్న మార్పుల్లో విద్యుత్తు రంగం ముఖ్యమైనది. 2014లో రాష్ట్రం ఏర్పడిన సమయంలో విద్యుత్తు కొరత ప్రధాన సమస్యగా ఉండేది. వ్యవసాయానికి పరిమిత గంటలపాటు విద్యుత్తు సరఫరా, పరిశ్రమలకు పవర్ హాలిడేలు, గృహ వినియోగదారులకు కోతలు వంటి సమస్యలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, ప్రసార, పంపిణీ వ్యవస్థల విస్తరణ వంటి చర్యలు చేపట్టారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా విధానం అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ‘సామాజిక ఆర్థిక నివేదిక-2022’ ప్రకారం విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2014-15లో 9,470 మెగావాట్ల నుంచి 2020-21 నాటికి 17,218 మెగావాట్లకు పెరిగింది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగునీటి రంగంలో చేపట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ముఖ్యమైన అంశంగా నిలిచాయి. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు సాగునీటి వసతుల విస్తరణ లక్ష్యంతో చేపట్టారు. గోదావరి జలాలను వినియోగించుకొని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ చేపట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతుబంధు తదితర పథకాలతో రాష్ట్రంలో పం టల సాగు విస్తీర్ణం, వరి సాగు గణనీయంగా పెరిగింది. దేశంలోని ప్రధాన ధాన్యం ఉత్పత్తి రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రగామిగా ఎదిగింది.
నవంబర్ 29 అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన పోరాటానికి ఒక నిర్దిష్ట దిశను ఇచ్చిన రోజు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ప్రారంభమైన ఆ కీలక దశ.. స్వరాష్ట్ర కలను సాకారం చేసేంతవరకు సాగింది. అందుకే, దీక్షా దివస్ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు కేవలం ఒక రాజకీయ సమావేశంగా మాత్రమే కాకుండా.. తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరులు, ఉద్యమకారుల పాత్ర, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతి, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలను చర్చించుకునే వేదికగా ఈ సభా వేదిక నిలువాల్సిన అవసరం ఉన్నది.