షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 26 నవం 2026, 7:25 ఉద.
క్రైమ్ వార్తలు

Petrol Tanker Explosion : ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 30 మంది మృతి.. 15 మందికి గాయాలు

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 26 నవం 2026, 7:25 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Petrol Tanker Explosion : ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 30 మంది మృతి.. 15 మందికి గాయాలు

Egypt Petrol Tanker Explosion : పెట్రోల్‌తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. క్షణాల్లో మంటలు చెలరేగి పేలిపోయింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో చుట్టు పక్కల వాహనాలు కూడా మంటల్లో చిక్కుకొని దగ్దమయ్యాయి. ఈ ఘటనలో ఏకంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర దుర్ఘటన ఈజిప్టు రాజధాని గ్రేటర్ కైరో పరిధిలోని గిజా ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈజిప్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన పెట్రోల్ ట్యాంకర్ ప్రయాణిస్తున్న సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. గిజాలోని అల్-వారాక్ ప్రాంతంలో ఓ సొరంగ మార్గం పైన ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్లకు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ట్యాంకర్ పేలుడుతో చెలరేగిన మంటలు సమీపంలోని పలు వాహనాలకు వ్యాపించాయి. దీంతో వాహనాలు పూర్తిగా కాలిపోయి ఇనుప ముక్కలుగా మారిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు 23 అంబులెన్సులు, అత్యవసర సేవల వాహనాలను రంగంలోకి దించారు. ఈ ఘటనలో 30 మంది మరణించగా.. మరో 15 మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఘోర ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రహదారిపై సాధారణ రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

#క్రైమ్వార్తలు
Egypt Petrol Tanker Explosion : పెట్రోల్‌తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. క్షణాల్లో మంటలు చెలరేగి పేలిపోయింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో చుట్టు పక్కల…