షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 12:04 సా.
యువత

యువత భవిష్యత్తే లక్ష్యం.. కిషన్ రెడ్డి నషా ముక్త్ భారత్ యాత్ర!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 12:04 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
యువత భవిష్యత్తే లక్ష్యం.. కిషన్ రెడ్డి నషా ముక్త్ భారత్ యాత్ర!

హైదరాబాద్: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రను ప్రారంభించారు. బుధవారం అంబర్‌పేటలోని ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఫిలింనగర్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోందని, వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మూడు రోజుల పాటు సాగే పాదయాత్రలో రాత్రిపూట కూడా మార్గమధ్యంలోనే బస చేస్తానని ఆయన వెల్లడించారు. యాత్ర పొడవునా ప్రజలను, ముఖ్యంగా యువతను కలుస్తూ గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. మొదటి రోజు పాదయాత్ర అంబర్‌పేట ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై 6 నంబర్ జంక్షన్, తిలక్‌నగర్, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రి మీదుగా కొనసాగనుంది. మొదటి రోజు యాత్ర ముషీరాబాద్‌లోని కాశిష్ ఫంక్షన్ హాల్ వద్ద ముగియనుంది. రాత్రి అక్కడే బస చేయనున్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించడం, యువతను చెడు వ్యసనాల నుంచి కాపాడటం ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ హీరో వెంకటేష్, ఎంపీ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో అంబర్‌పేటలో సందడి నెలకొంది.

#యువత
హైదరాబాద్: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రను ప్రారంభించారు. బుధవారం…