Navodayam, 25 నవంబర్ 2026: జుట్టు సరిగా దువ్వుకోలేదని విద్యార్థినిని టీచర్ పైపుతో కొట్టడంతో చేయి విరిగిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో బుధవారం జరిగింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ప్రమీల రోజుమాదిరిగానే బుధవారం పాఠశాలకు వెళ్లింది. ఈ క్రమంలో పాఠాలు చెప్పే ఇంగ్లిష్ టీచర్ మంజుల ప్రమీల జుట్టు సరిగా దువ్వుకోలేదని పైపుతో రెండు చేతులపై బలంగా కొట్టింది. దీంతో ప్రమీల చేతులకు తీవ్ర గాయలయ్యాయి. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలకు చేరుకొని టీచర్‌ను నిలదీశారు.
కావాలని చేయలేదని, ప్రమీల వైద్య ఖర్చులు తానే భరిస్తానని టీచర్ చెప్పగా, విద్యార్థి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తమ కూతురి చేయి విరగొట్టిన టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా ప్రమీలను వెంటనే ఆసుపత్రికి తరలించగా చేయి విరిగినట్టు వైద్యులు నిర్దారించారు. ఘటనపై సమాచారం అందుకున్న మండల విద్యాధికారి జీవన్‌కుమార్ గురుకుల పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి మంజులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీచర్లు విద్యార్థుల పట్ల ప్రేమతో మెలగాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.